ప్రధాని మోడీపై యూఎస్ మీడియా ప్రశంసలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆ మాట అన్నందుకే..!

By Mahesh KFirst Published Sep 17, 2022, 2:44 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా మీడియా ప్రశంసలు కురిపించింది. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ అన్నట్టుగా ఆ కథనాలు రాసుకొచ్చాయి. దీనికి పుతిన్ తన సమాధానం ఇచ్చినట్టు వివరించాయి.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై అమెరికా మీడియా ప్రశంసల జల్లు కురిపించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉక్రెయిన్ పై యుద్ధం విషయమై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ఆయన ఉజ్బెకిస్తాన్‌లో సమర్కండ్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో చేశారు. 

సమర్కండ్‌లో జరిగిన ఎస్‌సీవో సమావేశానికి ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర దేశాల నేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇద్దరు దాదాపు స్నేహపూకంగానే మాట్లాడారని ది న్యూ యార్క్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఉభయ దేశాల మధ్య గల ఘనమైన చరిత్రను గుర్తు చేసుకున్నారని వివరించింది. అయితే, అదే సంభాషణలో ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం (మిలిటరీ చర్య!)ను ప్రస్తావించారని తెలిపింది. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని పుతిన్‌తో మోడీ అన్నారని వివరించింది. ఈ విషయాన్ని తాను ఫోన్‌లోనే పుతిన్‌కు చెప్పినట్టు ఆ సంభాషణలో గుర్తు చేశారని రిపోర్ట్ చేసింది.

ఈ వ్యాఖ్యలను అమెరికా మీడియా హైలైట్ చేశాయి. పుతిన్‌పై మోడీ విమర్శలు కురిపించారని, పుతిన్‌కు మోడీ చురకలు అంటించారని ది వాషింగ్టన్ పోస్టు, ది న్యూయార్క్ టైమ్స్ పత్రికలు కీలక కథనాలు రాసుకొచ్చాయి. 

ప్రధాని మోడీ వ్యాఖ్యలపైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారని ఈ కథనాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లో ఘర్షణలపై భారత వైఖరి తనకు తెలుసు అని పుతిన్ తెలిపారు. భారత్ తన ఆందోళనలను ఎల్లప్పుడూ వెల్లడిస్తూనే వచ్చిందని వివరించారు. ఈ ఘర్షణకు ఫుల్ స్టాప్ పెట్టడానికి తాము శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రత్యర్థి దేశ నాయకత్వం చర్చలు జరపడానికి నిరాకరించారని, వారి లక్ష్యాలను యుద్ధ రంగంలోనే సాధించుకుంటామని ప్రకటించడం దురదృష్టకరం అని పుతిన్ తెలిపినట్టు ఆ పత్రికలు రాశాయి. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని తెలియజేస్తామని పుతిన్.. ప్రధాని మోడీతో చెప్పినట్టుగా రిపోర్ట్ చేశాయి.

ఈ కథనాలనే అవి తమ వెబ్ పేజ్‌లలోనూ ప్రధాన కథనాలుగా పబ్లిష్ చేశాయి.

ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ఈ సదస్సులో కలుసుకున్నారు. గాల్వన్ లోయలో ఘర్షణల తర్వాత ప్రధాని మోడీ తొలిసారి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు. అయితే, ఈ సదస్సులో మోడీ, జిన్ పింగ్‌లు కొంత డిస్టెన్స్ మెయింటెయిన్ చేసినట్టుగానే తెలిసింది.

click me!