
లక్నో: అంబులెన్స్ అంటేనే అత్యవసరం. ఏ సమయంలోనైనా అంబులెన్స్‌కు కాల్ వెళ్లిందంటే.. అది అత్యవసర పరిస్థితే అయి ఉంటుంది. అందుకే అంబులెన్స్‌లు ఎప్పుడూ సర్వం సిద్ధంతో ఉంటాయి. వెహికిల్ ఫిట్‌నెస్, చమురు, డ్రైవర్లు, లోపలి మెడికల్ ఎక్విప్‌మెంట్లు అన్నీ రెడీగా ఉంటాయి. అలా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా పేషెంట్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఒక చోట నుంచి మరో చోటకు రిఫర్ చేశారు. ఆమెను నిర్దేశిత హాస్పిటల్ చేరవేయడానికి అంబులెన్స్ సిద్ధం అయింది. ఆమెను అంబులెన్స్‌లో ఎక్కించుకుని వెళ్లుతుండగా గమ్యం చేరకముందే మార్గంమధ్యలోనే ఇంధనం అయిపోయి ఆగిపోయింది. దీంతో ఆ మహిళ పరిస్థితి దారుణంగా మారింది. అప్పుడే అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్ నుంచి మీరట్‌కు ఆ అంబులెన్స్ ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, దారి మధ్యలోనే చమురు అయిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దగ్గరలో పెట్రోల్ డీజిల్ బంక్ లేదు. దీంతో ఆ డ్రైవర్‌కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతలోనే ఈ విషయాన్ని స్థానికులు కొందరు తెలుసుకున్నారు. ఓ ట్రాక్టర్ వెంటనే రంగంలోకి దిగింది. ఆ అంబులెన్స్‌ను ట్రాక్టర్‌కు కట్టుకుని సమీపంలోని ఫ్యూయెల్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ మళ్లీ ఇంధనాన్ని నింపుకుని మీరట్‌కు బయల్దేరింది.
అయితే, ఆ అంబులెన్స్‌ను ట్రాక్టర్‌కు తాడుతో కట్టుకుని దగ్గరలోని ఫ్యూయెల్ స్టేషన్‌కు తరలిస్తుండగా కొందరు వీడియోలు రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన జిల్లా అధికారుల్లో గందరగోళానికి దారి తీసింది. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేష్ మోహన్ ఈ ఘటనపై మాట్లాడుతూ, ఆ అంబులెన్స్ మీరట్‌కు చెందినది కాదని అన్నారు. బిజ్నోర్ నుంచి మీరట్‌కు వస్తుండగా ఆ అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయిందని వివరించారు.