అది అమెజాన్ కంపెనీ కాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0: ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక మరో సంచలన కథనం

Published : Sep 27, 2021, 01:55 PM IST
అది అమెజాన్ కంపెనీ కాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0: ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక మరో సంచలన కథనం

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహిత సంస్థ, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ వారపత్రిక పాంచజన్య ఇటీవలే ఇన్ఫోసిస్‌పై ప్రచురించిన కథనం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌పై సంచలన కథనాన్ని ప్రచురించనుంది. అమెజాన్ సంస్థను ఈస్టిండియా కంపెనీగా పోలుస్తూ పాంచజన్య టైటిల్ కవర్‌ను ఆ పత్రిక ఎడిటర్ హితేశ్ శంకర్ ట్వీట్ చేశారు.  

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్(RSS) అనుబంధ పత్రిక పాంచజన్య(Panchjanya)లోని వ్యాసం ఇటీవలే ఇన్ఫోసిస్‌(Infosys)పై చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనాన్ని రేపాయి. ఐటీ రంగంలోని అంతర్జాతీయ సంస్థలూ ఈ వ్యాసం ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తరుచూ లోపాలు రావడం వెనుక దేశద్రోహ కుట్ర ఉన్నదనే కోణంలో ఆ వ్యాసం చర్చించింది. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక ఇలాంటి వ్యాసం ప్రచురించడంపై వ్యాపారవర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా, ఇదే పత్రిక మరో సంచలనానికి తెరలేపింది. ఈ సారి ఈకామర్స్(E-Commerce) దిగ్గజం అమెజాన్(Amazon) సంస్థపై వివాదాస్పద కవర్ స్టోరీతో ముందుకు రానుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్(Jeff Bezos) కవర్ ఫొటోతో ఈ ఇష్యూ అందుబాటులోకి రానుంది. ఈ పిక్‌ను పాంచజన్య ఎడిటర్ హితేశ్ శంకర్ ట్వీట్ చేశారు.

18వ శతాబ్దంలో భారత్‌పై గుత్తాధిపత్యం కోసం ఈస్టిండియా కంపెనీ(East India) ఏదైతే చేసిందో.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కూడా అదే చేస్తున్నట్టు తెలుస్తున్నదని ఆ వ్యాసం ఆరోపించినట్టు తెలిసింది. భారత అధికారులకు అమెజాన్ న్యాయప్రతినిధులు లంచాలు(Bribe) ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలను ఉటంకిస్తూ ఆ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ భారీగా లంచాలు ఇచ్చి కప్పిపుచ్చుకునేంత పెద్ద తప్పు ఏం చేసిందని ఎడిటర్ ట్వీట్ చేశారు. ఈ సంస్థతో భారత అంకురాలు ఎందుకు భయపడుతున్నాయని అడిగారు. భారత ఆర్థిక, సాంస్కృతి స్వతంత్రం హరిస్తున్నదన్న ఆందోళనలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అమెజాన్.. ఈస్టిండియా కంపెనీ 2.0 టైటిల్‌తో పాంచజన్య కవర్ స్టోరీని ప్రచురించనుంది. అక్టోబర్ 3వ తేదిన దీన్ని ప్రచురించనుంది.

 

లీగల్ ఫీజుల కింద రూ. 8,500 కోట్లు చెల్లింపులపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవినీతి ఆరోపణలపై అటు అమెజాన్ సంస్థ, ఇటు ప్రభుత్వం సీరియస్‌గానే ఉన్నాయి. అమెజాన్ కూడా అంతర్గత దర్యాప్తును ఆదేశించింది. సీనియర్ కార్పొరేట్ కౌన్సెల్‌ను సెలవుపై పంపింది.

ఇన్ఫోసిస్‌పై రాసిన కథనం వివాదాస్పదమైన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్ఎస్ఎస్ ఆ పత్రికతో విబేధించాయి. ఆ కథనం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించగా, ఆ పత్రికలోని వ్యాసాలతో తమ భావజాలానికి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu