పార్టీలో పెద్ద కొడుకు పాత్ర పోషించాలి.. కోడలు పాత్ర కాదు.. రేవంత్ రెడ్డికి ఏలేటి మహేశ్వర రెడ్డి చురకలు..

By SumaBala BukkaFirst Published Dec 16, 2022, 7:23 AM IST
Highlights

రేవంత్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పార్టీలో పెద్ద కొడుకు పాత్ర పోషించాలని, కోడలు పాత్ర కాదంటూ విమర్శలు గుప్పించారు మహేశ్వర్ రెడ్డి. 

హైదరాబాద్ : టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి  పార్టీలో ప్రస్తుతం పెద్ద కొడుకు పాత్ర పోషించాలని.. కానీ అతను కోడలు పాత్ర పోషిస్తున్నాడని అన్నారు. టిపిసిసి అధ్యక్షులు హోదాలో ఆయన  ఒంటెత్తు పోకడలు కారణంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయని మండిపడ్డారు. అవసరమైతే పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగాల్సి ఉంటుందని అన్నారు. సీనియర్ నేతలను కలుపుకుంటూ, సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. అప్పుడే పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలోనే ఆయన రేవంత్ రెడ్డి కోడలు పాత్ర పోషించడం కాదు.. పెద్ద కొడుకు పాత్ర పోషించాలని వ్యాఖ్యానించారు.

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ పదవుల్లో ఉన్న నాయకులు అందరిని కలుపుకుపోవాలని,  సమన్వయం చేసుకుంటూ పోతే అపార్థాలు ఉండవని అన్నారు. అంతేకానీ,  కోడళ్ల పంచాయతీతో పార్టీ విభేదాలను పోలిస్తే మాత్రం పార్టీ చిన్నాభిన్నం అవుతుందని అన్నారు.  పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, అందరూ ఏదో ఒక రోజు మాజీలుగా అవుతారని అన్నారు. అందుకే పార్టీ పదవిలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుపోవాలని సూచించారు.

ఎన్‌పీఏ ప్రభుత్వం' కారణంగానే పెట్రోలియం ధరలు పెరుగుతున్నాయి.. : బీజేపీ స‌ర్కారుపై కేటీఆర్ విమ‌ర్శ‌లు

కాంగ్రెస్ పార్టీని  వేధిస్తున్న మరో అంశం కోవర్టులు. దీనిమీద మాట్లాడుతూ.. కోవర్టుల గురించి పదే పదే చర్చకు రావడం బాధాకరమైన విషయం అన్నారు. సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యల మీద తాను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని అన్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని ప్రతి నాయకుడు కోరుకుంటారని..  వాటికి మించి ఏమీ ఉండదని చెప్పారు. ఎన్నికల సమయం రాబోతుందని గుర్తు చేశారు. ఈ సమయంలో పార్టీ కమిటీల్లో బలప్రదర్శన కాదు.. ఎన్నికల్లో బల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తమ బలంతో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని సూచించారు. ఈ సమస్యలమీద తొందర్లోనే ఢిల్లీకి వెడతామని, అధిష్టానంతో తమ ఆవేదన చెప్పుకుంటాం అని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

click me!