చరిత్ర సృష్టించిన ఎయిర్ ఇండియా మహిళల జట్టు..!

By telugu news teamFirst Published Jan 11, 2021, 10:18 AM IST
Highlights

ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి బెంగళూరుకు సోమవారం ఉదయం చేరింది. శాన్ ఫ్రాన్సిస్కో- బెంగళూరుకు మధ్య సుదీర్ఘమైన 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ విమానాన్ని మహిళా పైలట్ల నడిపి చరిత్ర సృష్టించారు.

ఎయిర్ ఇండియా లో పనిచేసే మహిళా సిబ్బంది చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ దూరాన్ని అందరూ మహిళా పైలెట్లే నడపడం గమనార్హం. భారత మహిళా పైలెట్లు ఈ సాహసం చేశారు. నలుగురు మహిళా పైలెట్లు, సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం చేసిన భారీ విమానం సోమవారం ఉదయం 3.07 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. 

శాన్ ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ176.. అట్లాంటిక్ మార్గంలో ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి బెంగళూరుకు సోమవారం ఉదయం చేరింది. శాన్ ఫ్రాన్సిస్కో- బెంగళూరుకు మధ్య సుదీర్ఘమైన 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ విమానాన్ని మహిళా పైలట్ల నడిపి చరిత్ర సృష్టించారు.

బెంగళూరు విమాశ్రయం చేరుకున్న పైలట్లకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఈ ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రధాన పైలెట్‌గా కెప్టెన్ జోయా అగర్వాల్.. అసిస్టెంట్ పైలట్స్‌గా తెలుగు అమ్మాయి కెప్టెన్‌ పాపగారి తన్మయి, కెప్టెన్‌ సోనావారే, కెప్టెన్‌ శివానీ మనహాస్ వ్యవహరించారు. ‘ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఓ గొప్ప అనుభవం.. ప్రయాణానికి దాదాపు 17 గంటలు పట్టింది’ అని సహాయ పైలట్ కెప్టెన్ శివానీ మనహాస్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రధాన పైలట్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేము చరిత్రను సృష్టించాం.. కేవలం ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాదు, విమానంలోని అందరమూ మహిళా పైలట్లైనా విజయవంతంగా గమ్యానికి చేరాం.. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది.. ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల 10 టన్నుల ఇంధనం ఆదా అయ్యింది’ అని వ్యాఖ్యానించారు.

click me!