
Uttar Pradesh police : సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం రాత్రి కొందరు పోలీసులు లాకప్‌లో ఉన్న కొంతమంది వ్యక్తులను కొట్టిన వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో కొంత మంది వ్యక్తులను పోలీసులు లాఠీలతో చితక్కొడుతున్నారు. బాధితులు లబోదిబో మంటున్నారు. అయిన పట్టించుకోని పోలీసులు.. వారిపై లాఠీ ప్రతాపం చూపించారు. అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఇలాంటి లాకప్ దాడులపై ప్రశ్నలు లేవనెత్తాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై మౌనంగా ఉంటే న్యాయం అందని ద్రాక్షలా మిగులుతుందన్నారు. పోలీసు కస్టడీలో మరణించిన వారి సంఖ్య విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలో యూపీ అగ్రస్థానంలో ఉందని, దళితుల అణచివేతలో ముందుందని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఇలాంటి క్రూర అణచివేత క్రమంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. జిల్లాలో అల్లర్లు మరియు రాళ్లదాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిరసనకారులను సహరాన్‌పూర్ కొత్వాలి వద్ద పోలీసులు కొట్టినట్లు ఇందులో ఆరోపణలు వచ్చాయి.
ట్వీట్ వైరల్ కావడంతో, సహరాన్‌పూర్ ఎస్‌ఎస్పీ ఆకాష్ తోమర్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ వీడియో జిల్లాకు చెందినది కాదని చెప్పారు. “నేను ఇంకా వీడియో చూడలేదు కానీ అది సహరాన్‌పూర్ నుండి కాదు. ఇది ఎక్కడ నుండి వచ్చిందో లేదా సందర్భం ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. మేము కేసును పరిశీలించి ఎవరైనా దోషిగా తేలితే చర్యలు తీసుకుంటాము” అని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చెలరేగిన హింసాత్మక ప్రదర్శనలలో పాల్గొన్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విరుచుకుపడిన వెంటనే అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. శుక్రవారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 255 మందిని అరెస్టు చేసినట్లు పీవోలు తెలిపారు . నిరసనలకు సంబంధించి మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రవక్త ముహమ్మద్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ చేయబడిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. అలాగే, ఢిల్లీ యూనిట్ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ జిందాల్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు.
ప్రయాగ్‌రాజ్‌లోని అటాలా ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల తర్వాత జరిగిన హింసలో ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ నేతల పేర్లు కూడా ప్రముఖంగా ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని కరేలాబాగ్ వార్డుకు చెందిన సమాజ్‌వాదీ కౌన్సిలర్ ఫజల్ ఖాన్, దిల్షాద్ మన్సూరిపై ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.