
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే వచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. కేరళపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఏషియానెట్ న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీపై, యోగీపై విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లిం మతతత్వాన్ని రెచ్చగొట్టడం, హింసను ప్రేరేపించడం మాత్రమే యోగికి తెలుసని ఆరోపించారు. యూపీ కంటే కేరళ హెల్త్‌తో పాటు ఇతర అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తుడిచిపెట్టేస్తారని అఖిలేష్ చెప్పారు. యూపీలో రెండో దశ పోలింగ్ ముగిసింది.. బీజేపీని ఓడించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. అందరూ సైకిల్ గుర్తుకే (సమాజ్ వాదీ పార్టీ గుర్తు) ఓటు వేస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.
ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలుకు సమాధానమిచ్చిన అఖిలేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదన్నారు. వాళ్లు కేవలం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూపీ ఆరోగ్య రంగంతో పాటుగా ఇతర రంగాలలో కూడా కేరళ కంటే వెనుకబడి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసిందని విమర్శించారు. హామీలను నెరవేర్చకపోవడంతోనే మాటల దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు."
దళిత వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు... కానీ ప్రస్తుతం రైతుల పరిస్థితి చూస్తే ఏ విధంగా అన్యాయం చేశారనే అర్థమవుతుందన్నారు. రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.
‘జ్యుడీషియల్ కమిషన్ జాబితాలో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఆరోగ్యం, విద్యలో కేరళ ముందంజలో ఉంది. ఉపాధి పరంగా యూపీ కంటే ముందుంది. యూపీ ముఖ్యమంత్రికి ఎవరితో పోల్చాలో కూడా తెలియడం లేదు. హిందూ-ముస్లిం మతతత్వాన్ని వ్యక్తీకరించడం, హింసను ప్రేరేపించడం, కుల సమస్యలను ప్రేరేపించడంపై ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పించలేక, ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచలేక, పెట్టుబడులు తీసుకురాలేకపోయింది. రైతులకు ఎలాంటి సాయం అందలేదు. యూపీలో విద్యుత్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తామన్న హామీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటుంది’ అని అఖిలేష్ అన్నారు.