కాంగ్రెస్, బీఎస్పీలు అసలు ఏ పక్షం.. ఎవరికైనా మా పార్టీ తలుపులు తెరిచేవున్నాయి: సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్

Siva Kodati |  
Published : Aug 01, 2021, 08:37 PM IST
కాంగ్రెస్, బీఎస్పీలు అసలు ఏ పక్షం..  ఎవరికైనా మా పార్టీ తలుపులు తెరిచేవున్నాయి: సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్

సారాంశం

కాంగ్రెస్, బీఎస్పీలపై విమర్శలు గుప్పించారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. ఈ రెండు పార్టీలు ఎవరి  పక్షమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించే దిశగా అన్ని పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.   

కొద్దినెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్, బీఎస్పీలపై ఆదివారం విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఎస్పీ ఏ పక్షమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారి పోరాటం భారతీయ జనతా పార్టీపైనా.. లేక సమాజ్‌వాదీ పార్టీపైనా అన్నది స్పష్టం చేయాలని అఖిలేశ్ కోరారు.

వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చిన్నపార్టీలతో పొత్తుకు తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉంచినట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఎన్నో చిన్న పార్టీలు ఇప్పటికే తమతో కలిసి ఉన్నాయని.. మరికొన్ని చిన్న పార్టీలు కూడా తమతో కలిసివస్తాయని ఆశిస్తున్నట్లు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించే దిశగా అన్ని పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 

పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ తీరును అఖిలేశ్‌ యాదవ్ తప్పుబట్టారు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 350కి పైగా సభ్యులు ఉండటంతోపాటు.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇతరుల ఫోన్లు ట్యాప్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. కేంద్రం చర్యలు విదేశీ శక్తులకు మద్ధతిచ్చేలా ఉన్నాయని ఎస్పీ చీఫ్ ఆరోపించారు.  
 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu