
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ బీజేపీకి అసలైన పోటీ సమాజ్‌వాదీ పార్టీ నుంచే వస్తున్నది. బీఎస్పీ ఈ ఎన్నికల్లో హడావుడి చేయడం లేదని, మౌన మార్గాన్ని ఎంచుకున్నదని నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి పోరాడుతుండగా.. ముస్లింలకు మరో అవకాశాన్ని కల్పిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం పార్టీ కూడా బరిలోకి దిగింది.
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పునాదిని పటిష్టం చేసుకున్నట్టు అర్థం అవుతున్నది. కాగా, బీజేపీని బలంగా ఢీకొడుతున్న సమాజ్‌వాదీ పార్టీకి మరో రెండు పార్టీల నుంచి సిసలైన ముప్పు ఎదురవుతున్నది. బీఎస్పీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులతో ఎస్పీ అభ్యర్థుల గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీల సోషల్ ఇంజనీరింగ్ క్లాష్ అవుతున్నాయి.
బీఎస్పీకి కోర్ ఓటు బ్యాంక్ దళితులే. ప్రధానంగా దళితుల ఓట్లతోనే బీఎస్పీ విజయాలను పొందుతుంటుంది. దళితులతో పాటు ముస్లింలనూ ఆకర్షిస్తుంది. అయితే, బీఎస్పీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిందని, అది బీజేపీకి మద్దతు ఇస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ తమ పార్టీ సర్‌ప్రైజ్ విన్ నమోదు చేస్తుందని మాయావతి చెబుతున్నారు. బీఎస్పీ గతంలో దళితులు, ముస్లిలంలతోపాటు బ్రాహ్మిణ్ ఓట్లనూ రాబట్టింది. దాన్ని సర్‌ప్రైజ్ విన్‌గా పేర్కొంది. ఈ సారి కూడా అదే ప్రయోగంలో ఉన్నది. అందుకే బీఎస్పీ ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు బ్రాహ్మణ నేత సతీష్ చంద్ర మిశ్రాకు అప్పజెప్పింది.
కాగా, ముస్లిం ఓట్లనే ప్రధానంగా రాబట్టే ఎంఐఎం పార్టీ ఇక్కడ మరికొన్ని కుల ఆధారిత పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. సీఎం సీటు ప్రకటించింది. ఈ పార్టీ కేవలం ముస్లిం ఓట్లకే పరిమితం కాదు. దళితులనూ కలుపుకుని భీమ్ మీమ్ నినాదాన్ని ఇస్తున్నది. ఇదిలా ఉండగా బీజేపీకి పోటీ ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ముస్లింలు యాదవులు ఉంటారు. బీఎస్పీ బీసీ ఓట్లపైనా కాన్సంట్రేట్ చేయడం.. ఎంఐఎం పార్టీ బరిలోకి దూకడం వంటివి సమాజ్‌వాదీ పార్టీ గెలుపు ఆశలకు గండికొడుతున్నాయి. బీఎస్పీ పార్టీ ఈ సారి 90 మంది ముస్లిం క్యాండిడేట్లను బరిలోకి దించింది. ఈ నిర్ణయం సమాజ్‌వాదీ పార్టీకి సవాల్‌గా మారవచ్చు.
ఇదిలా ఉండగా, హర్ధోయ్ లో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్డోయ్‌లో 2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. ఆ దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారనీ, కోర్టు ఇటీవల దోషులకు మరణశిక్ష విధించిందని పేర్కొన్నారు. "అహ్మదాబాద్ పేలుళ్ల కేసు విచారణ జరుగుతున్నందున ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. ఈ రోజు, కోర్టు వారికి శిక్ష విధించింది. ఈప్పుడు నేను దేశం ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను. పేలుళ్లలో, బాంబులను సైకిళ్లపై ఉంచారు... వారు [ఉగ్రవాదులు] ఎందుకు సైకిళ్లను ఎంచుకున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను" అని మోడీ అన్నారు. ఎస్పీపై విమర్శలు గుప్పించారు.
తన పార్టీ చిహ్నాంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. సైకిల్ గ్రామీణ భారతదేశానికి గర్వకారణం అని అఖిలేష్ యాదవ్ అన్నారు. "మా సైకిల్ రైతులతో పొలాలను కలుపుతుంది. వారి శ్రేయస్సుకు పునాది వేస్తుంది. మా చక్రం సామాజిక సరిహద్దులను ఛేదిస్తుంది. కుమార్తెలను పాఠశాలకు పంపుతుంది" అంటూ ట్వీట్ చేశారు.