
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో 12యేళ్లపాటు తీవ్ర భయాందోళనలు సృష్టించిన ఓ దోపిడీ దొంగ తాజాగా జైలునుంచి విడుదలయ్యాడు. నజ్జు అలియాస్ రజ్జు అనే ఈ మాజీ దోపిడీ దొంగ 23 ఏళ్ల తర్వాత బరేలీ సెంట్రల్ జైలు నుంచి వారం రోజుల క్రితం విడుదలయ్యాడు. ఆ తరువాత షాజహాన్‌పూర్‌లోని ఒక ఆలయానికి 101 కిలోల గంటను సమర్పించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యవత నేరాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.
నజ్జు అలియాస్ రజ్జుకు ఇప్పుడు 58 ఏళ్లు. నజ్జు షాజహాన్‌పూర్, దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 ఏళ్లపాటు భీభత్సం సృష్టించాడు. ఈ మాజీ దోపిడీ దొంగ కత్రా అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ 'ప్రిన్స్'తో కలిసి దేవాలయానికి వచ్చాడు. సోమవారం జిల్లాలోని పరూర్ ప్రాంతంలోని ఆలయంలో ఎమ్మెల్యేతో కలిసి నజ్జు గంట సమర్పించారు.
కోయంబత్తూరులో పుష్ప సీన్.. ట్రక్కులో రహస్య గది.. గంధపు చెక్కలు తరలిస్తూ..150కి.మీ.లు ఛేజ్ చేసి...
మాజీ దోపిడీ దొంగను ఎమ్మెల్యే.. "మా గౌరవనీయమైన మామయ్య" అని ప్రస్తావించారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ, నజ్జు "చాలా కష్టపడ్డాడు" అని చెప్పాడు."అతను చేసిన తప్పు ఏదైనా, 23 సంవత్సరాల శిక్షను అనుభవించాడు. 23 ఏళ్ల తర్వాత ఈరోజు విడుదలయ్యాడు. ఇక్కడ నేను ఆయనకు స్వాగతం పలుకుతాను, ఆయనను గౌరవిస్తాను’’ అని వీర్ విక్రమ్ సింగ్ అన్నారు.
గంటను దేవాలయానికి సమర్పించిన తరువాత, నజ్జు తాను చేసిన నేరాలకు పశ్చాత్తాపపడ్డాడు. నేరాలకు దూరంగా ఉండాలని.. వారి భవిష్యత్తు.. కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలని యువ తరానికి విజ్ఞప్తి చేశారు.
కత్రా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ఎవరైనా నేరం మానేసి జనజీవన స్రవంతిలో చేరాలనుకుంటే, వారికి నేను సహాయం చేస్తాను. నజ్జు నాతో పాటు ఆలయానికి వచ్చాడు. అతను చేసిన నేరాలకు క్షమాపణలు తెలిపాడు. సాధారణ జీవితాన్ని గడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు’ అని అన్నాడు.
నజ్జుపై జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయని పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనా తెలిపారు. "ఇందులో 1999 నాటి హత్య కేసు కూడా ఉంది, ఈ కేసులో అతనికి జీవిత ఖైదు విధించబడింది. బరేలీ సెంట్రల్ జైలుకు పంపారు" అని పోలీసు సూపరింటెండెంట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
"1999లో, నజ్జు ముగ్గురు సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఒక పోలీసును కాల్చిచంపాడు. ఆ తరువాతి క్రమంలో, పోలీసులు అతనిపై ఒత్తిడి పెంచడంతో 1999లో లొంగిపోయాడు. అప్పటి నుండి అతను బరేలీ సెంట్రల్ జైలులో ఉన్నాడు" అని మీనా చెప్పారు. షాజహాన్‌పూర్, బరేలీ, ఫరూఖాబాద్, బుదౌన్, ఎటా, హర్దోయ్ జిల్లాల్లో నజ్జూ ముఠా ప్రభావం ఎక్కువగా ఉంది.