
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి వ్యతిరేకంగా మిజోరాం శాసనసభ మంగళవారం (ఫిబ్రవరి 14) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలో ఎక్కడైనా యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి చర్యలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని పేర్కొంది. రాష్ట్ర హోంమంత్రి లాల్‌చామ్లియానా ప్రతిపాదనను సమర్పిస్తూ.. యూసీసీని అమలు చేస్తే దేశ విభజన జరుగుతుందని అన్నారు. మైనారిటీల మత, సామాజిక ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలను అంతం చేసే ప్రయత్నమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలును వ్యతిరేకిస్తూ మిజోరాం అసెంబ్లీ ఫిబ్రవరి 14న అధికారిక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. హోం మంత్రి లాల్‌చామ్లియానా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "భారతదేశంలో యూసీసీని అమలు చేయడానికి తీసుకున్న లేదా ప్రతిపాదించే ఏ చర్యనైనా వ్యతిరేకించాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది" అని తీర్మానం అమోదం తర్వాత తెలిపారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ లాల్‌చామ్లియానా మాట్లాడుతూ.. యూసీసీ అమల్లోకి వస్తే దేశం విచ్ఛిన్నమవుతుందనీ, ఎందుకంటే ఇది మిజోలతో సహా మత మైనారిటీల మత లేదా సామాజిక ఆచారాలు, ఆచార చట్టాలు, సంస్కృతులు-సంప్రదాయాలను రద్దు చేసే ప్రయత్నమని ఆయన అన్నారు.
యూసీసీని అమలు చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న మంత్రి, దాని వల్ల అనేక వివాదాలు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉందని ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్ లో యూసీసీని చట్టబద్ధం చేసేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ ఎంపీ ఒకరు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. "ప్రతిపాదిత చట్టం పార్లమెంటులో ఆమోదం కోసం పెండింగ్ లో ఉందన్నారు. మైనారిటీల మతపరమైన లేదా సామాజిక ఆచారాలు, ఆచార చట్టాలు, సంస్కృతులు-సంప్రదాయాలను పక్కన పెట్టడం లేదా రద్దు చేయడం ద్వారా దేశంలో ఏకరూప కోడ్ ను విధించడమే ఈ ప్రతిపాదిత చట్టం లక్ష్యం" అని లాల్‌చామ్లియానా అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ప్రకారం మన సామాజిక-మత సంప్రదాయాలను కాపాడుకునే హక్కు మనకు ఉందని హోంమంత్రి లాల్‌చామ్లియానా పేర్కొన్నారు. యూసీసీ అమలు దేశం మొత్తానికి మంచిది కాదని కూడా ఆయన పేర్కొన్నారు. 2018-19లో యూసీసీ అమలును బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిందని లాల్‌చామ్లియానా ఆరోపించారు. కాగా, ఉమ్మడి పౌర స్మృతిని (యూనిఫామ్ సివిల్ కోడ్) అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మిజోరాం అసెంబ్లీ తీర్మానంపై చర్చలో సీఎం జోరంతంగ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత జోడింట్లుంగా, జో పీపుల్స్ లెజిస్లేచర్ పార్టీ నేత లాల్దుహోమా, బీజేపీ శాసనసభ్యుడు బీడీ చక్మా, అధికార ఎంఎన్ఎఫ్ సభ్యుడు సి లాల్మువాన్పుయా పాల్గొన్నారు.
ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మిజోరాం రాజ్యసభ సభ్యుడు కె.వన్లాల్వేనా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో యూసీసీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభకు తెలిపారు. యూసీసీ చట్టం చేయడానికి ముందు వ్యతిరేకించడానికి ఇదే సరైన సమయమని మిజోరాం సీఎం జోరంథాంగ అన్నారు. యూసీసీ అమల్లోకి వస్తే దేశ ఉనికికే భంగం వాటిల్లుతుందని ఆయన అన్నారు.