రానున్న రోజుల్లో గాల్లో ఎగిరే ట్యాక్సీలు.. నూతన డ్రోన్ పాలసీపై కేంద్రమంత్రి

By telugu teamFirst Published Aug 26, 2021, 6:57 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన డ్రోన్ పాలసీ కింద రానున్న రోజుల్లో గాల్లో ఎగిరే ట్యాక్సీలు రావచ్చునని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇటువైపుగా ప్రయోగాలు జరుగుతున్నాయని వివరించారు. నూతన డ్రోన్ పాలసీతో ఎయిర్ ట్యాక్సీలు సాధ్యపడవచ్చునని తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్యాక్సీలు రోడ్లపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గాల్లో ఎగిరే ట్యాక్సీ చూడవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నూతన డ్రోన్ పాలసీ ద్వారా ఇది సాధ్యపడే అవకాశముందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా నూతన డ్రోన్ పాలసీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే కేంద్రమంత్రి సింధియా పైవిధంగా స్పందించారు.

రక్షణ శాఖ, హోం శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని, ఇవి త్వరలోనే శత్రువుల డ్రోన్‌లను నేలమట్టం చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎయిర్ ట్యాక్సీలను ప్రస్తావించారు. ‘ఇప్పుడు ఉబర్ వంటి ట్యాక్సీలను రోడ్లపై చూస్తున్నాం. నూతన డ్రోన్ పాలసీ కారణంగా త్వరలోనే గాల్లో ఎగిరే ట్యాక్సీలనూ చూడగలం. ఇది కచ్చితంగా సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీలపై పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. వీటికి సంబంధించి నూతన అంకుర సంస్థలూ అనేకం వస్తున్నాయని చెప్పారు.

సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో డ్రోన్ పాలసీని సరళీకరించినట్టు పేర్కొంది. ఈ పాలసీ ద్వారా ఇకపై డ్రోన్‌లు ఆపరేట్ చేయడానికి 25 ఫారాలు నింపాల్సిన పనిలేదని, కేవలం ఐదు నింపితే సరిపోతుందని వివరించింది. అంతేకాదు, 72 రకాల ఫీజు చార్జీలను నాలుగు రకాల ఫీజులుగా కుదించినట్టు తెలిపింది. 

2021 మార్చిలో కేంద్ర పౌరవిమానయాన శాఖ డ్రోన్ నిబంధనలను విడుదల చేసింది. వీటిపై విద్యావేత్తలు, స్టార్టప్‌లు, వినియోగదారులు అనేక అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారని పౌరవిమానయాన శాఖ ఆ ప్రకటనలో వివరించింది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే రూల్స్ మార్చాలని కేంద్రం సంకల్పించినట్టు తెలిపింది. ఫలితంగానే మరింత సరళీకృతమైన నిబంధనలను విడుదల చేసింది.

click me!