
Air India Pilots: తన మహిళా స్నేహితురాలిని కాక్ పిట్ లోకి ఆహ్వానించినందుకు ఎయిరిండియా పైలట్ ను విధులకు దూరంగా ఉంచిన నెల రోజుల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. గత వారం ఢిల్లీ-లేహ్ విమానం కాక్ పిట్ లోకి ఒక మహిళను ఆహ్వానించినందుకు ఎయిర్ లైన్స్ ఇప్పుడు ఇద్దరు పైలట్లపై చర్యలు ప్రారంభించింది. ఏఐ-445 విమానం కాక్ పిట్ లోకి అనధికారిక మహిళా ప్రయాణికురాలు ప్రవేశించినట్లు క్యాబిన్ సిబ్బంది నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎయిరిండియా యాజమాన్యం పైలట్, కో పైలట్ పై చర్యలు తీసుకుంది. ఏఐ-445 పైలట్ మహిళా స్నేహితురాలు నిబంధనలు పాటించకుండా కాక్ పిట్ లోకి ప్రవేశించిందనీ, ఇద్దరు పైలట్లను ఎయిరిండియా విధులకు దూరంగా ఉంచిందని ఎయిరిండియా ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ విషయం డీజీసీఏకు తెలుసనీ, విధివిధానాలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. దర్యాప్తు కోసం ఎయిరిండియా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. దీనిపై ఎయిరిండియా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. భద్రత పరంగా లేహ్ మార్గం దేశంలో అత్యంత క్లిష్టమైన, సున్నితమైన విమాన మార్గాల్లో ఒకటి అనీ, వాణిజ్య విమానంలో కాక్ పిట్ లోకి అనధికారిక వ్యక్తిని అనుమతించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.
"ఎత్తైన పర్వత ప్రాంతం, దేశ రక్షణ దళాల స్థావరాలు ఉండటం వల్ల లేహ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన ఆపరేషన్లలో ఒకటి. అంతేకాకుండా, ఈ భూభాగంలో పనిచేయడానికి తగినంత ఆక్సిజన్ స్థాయిలు లేనందున చాలా మంచి ఆరోగ్య రికార్డు అవసరం, ఈ కారణంగా లేహ్ కార్యకలాపాలకు మంచి ఆరోగ్య రికార్డు ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లను మాత్రమే నియమించాలి" అని విమానయాన నిపుణుడు విపుల్ సక్సేనా అన్నారు. కాగా, ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిరిండియా విమానం Air India flight AI-915 కాక్ పిట్ లోకి తన మహిళా స్నేహితురాలిని ఆహ్వానించిన ఎయిరిండియా పైలట్ లైసెన్స్ ను డీజీసీఏ ఇటీవల సస్పెండ్ చేసింది. కాక్ పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్యలు తీసుకోనందుకు డీజీసీఏ ఇదివరకు విమానయాన సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది.