
Air Force Officer Attacked in Bengaluru : బెంగళూరులో ఓ దుండగులు అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. వైమానిక దళంలో పనిచేసే దంపతులతో దుర్భాషలాడుతూ అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
భార్యాభర్తలు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వింగ్ కమాండర్ ఆదిత్య బోస్, అతని భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత బోస్ సి.వి. రామన్ నగర్ లోని డీఆర్డీఓ కాలనీలో నివాసముంటున్నారు. వీరిద్దరు కారులో విమానాశ్రయానికి వెళ్తుండగా అకారణంగా కారును అడ్డుకుని దాడికి పాల్పడ్డాడో దుండగుడు.
బైక్ పై వచ్చిన వ్యక్తి తమ కారును అడ్డుకుని కన్నడలో అసభ్యకరంగా తిట్టాడని... అంతటితో ఆగకుండా దాడికి పాల్పడ్డాడని బాధిత డిఆర్డివో అధికారి బోస్ తెలిపారు. కారుపై డిఆర్డివో స్టిక్కర్ ను చూసాక అతడి కోపం మరింత పెరిగిందని... అసభ్యకరంగా తిడుతూ దాడికి పాల్పడ్డాడని బోస్ తెలిపారు. ఈ దాడిలో ఆదిత్య బోస్ నుదిటిపై గాయమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనపై జరిగిన దాడిని బోస్ సోషల్ మీడియా వేదికన బైటపెట్టాడు. "వెనుక నుండి వస్తున్న ఒక బైక్ మా కారును అడ్డుకుంది. ఏ కారణం లేకుండానే ఆ వ్యక్తి నన్ను కన్నడలో తిట్టడం మొదలుపెట్టాడు. నా కారుపై ఉన్న డిఆర్డివో స్టిక్కర్‌ను చూసి మీరు DRDO వ్యక్తులా అని అన్నాడు... నా భార్యను కూడా తిట్టాడు. నేను కారు దిగగానే అతను బైక్ కీతో నా నుదిటిపై కొట్టాడు. అది గట్టిగా తగలడంతో రక్తం వచ్చింది." బాధిత అధికారి అంటున్నారు.
దేశ భద్రతకోసం శ్రమించే వ్యక్తిని ఇలా ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. తన భార్య తనతో ఉండటం వల్లే తాను తప్పించుకోగలిగానని... స్థానిక అధికారులు, పోలీసుల నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదని అతను చెప్పాడు. 'దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటానికి దేవుడు నాకు శక్తిని ప్రసాదించుగాక. రేపు శాంతిభద్రతల అధికారులు న్యాయం చేయకపోతే నేను ప్రతీకారం తీర్చుకుంటాను" అని అతను వీడియోను ముగించాడు.
ఆ వీడియో వైరల్ అయిన తర్వాత తన తండ్రి అనారోగ్యం కారణంగా కోల్‌కతాకు వెళ్లాల్సి వచ్చిందని బోస్ తెలిపాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వింగ్ కమాండర్ కోల్‌కతా వెళ్లడానికి తొందర్లో ఉన్నందున పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే అతని భార్య తర్వాత పయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని.... పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.