
ఇటీవల నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీపీపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌డీపీపీ నేత, సీఎం నీఫ్యూ రియోకు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ నేత శరద్ పవార్ మద్ధతు ప్రకటించడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవార్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. తాను బీజేపీ ప్రభుత్వానికి ఎన్నడూ మద్ధతు ఇవ్వలేదని.. ఇకపైనా ఇవ్వబోనని చెప్పారు. బీజేపీకి ఎన్సీపీ మద్ధతు ఇవ్వకపోవడం ఇది రెండోసారని.. అయితే ఇదే చివరిది కాకపోవచ్చని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. సొంత పార్టీ నేత నవాబ్ మాలిక్‌ను కటకటాల వెనక్కి నెట్టిన వారికి మద్ధతు ఇస్తున్నారంటూ ఒవైసీ దుయ్యబట్టారు.
అయితే నీప్యూ రియోకు శరద్ పవార్ మద్ధతు ఇవ్వడంపై ఎన్సీపీ నార్త్ ఈస్ట్ ఇన్‌ఛార్జ్ రంగంలోకి దిగారు. నాగాలాండ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నీఫ్యూ రియోకు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. రియోకు మద్ధతు ఇచ్చే పార్టీలతో కలిసి వెళ్లాలని కూడా సూచించారని వ్యాఖ్యానించారు.
Also REad: బీజేపీ కూటమికి ఎన్సీపీ మద్దతు.. కమలం పార్టీకి సపోర్ట్ పై శరద్ పవార్ వివరణ ఇదే
అంతకుముందు ‘నాగాల్యాండ్ ఎన్నికలకు ముందే రియోతో తమకు ఒక అవగాహన ఉన్నది. ఎన్సీపీ ప్రభుత్వంలో చేరాలా? లేక ప్రతిపక్షంలో కూర్చోవాలా అనే అంశంపై సుదీర్ఘంగా ఎన్సీపీ చర్చించింది. నాగాల్యాండ్ విస్తృత ప్రయోజనాల కోసం అధికార పక్షంతో చేతులు కలపాలనే ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది’ అని శరద్ పవార్ తెలిపారు. అయితే, బీజేపీకి మద్దతు ఇవ్వడంపై శరద్ పవార్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. నాగాల్యాండ్ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతును, బీజేపీకి సపోర్ట్‌గా చూడరాదని అన్నారు. అది కచ్చితంగా తప్పే అవుతుందని వివరించారు. తాము రియోతో చేతులు కలిపామని, బీజేపీతో కాదని తెలిపారు.
ముంబయిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా బీజేపీపైనా విమర్శలు చేశారు. మేఘాలయా అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆరోపణలు చేశారు. మేఘాలయా ఎన్నికల్లో అక్కడి నేతలపై అవినీతి ఆరోపణలు బలంగా చేసిన బీజేపీ.. ఫలితాలు వెలువడ్డాక ఆ నేతలతోనే చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. అంతేకాదు, ఆ సీఎం (కొన్రాడ్ సంగ్మా) ప్రమాణానికి ప్రధాని మోడీ హాజరయ్యారని విమర్శించారు.