నాకు ‘Z’’ కేటగిరీ భద్రత అక్కర్లేదు.. సామాన్యుడిలా ‘‘ఏ’’ కేటగిరీలో వుంటా: లోక్‌సభలో అసదుద్దీన్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 04, 2022, 05:45 PM IST
నాకు ‘Z’’ కేటగిరీ భద్రత అక్కర్లేదు.. సామాన్యుడిలా ‘‘ఏ’’ కేటగిరీలో వుంటా: లోక్‌సభలో అసదుద్దీన్ వ్యాఖ్యలు

సారాంశం

కేంద్ర ప్రభుత్వం కల్పించిన జడ్ కేటగిరీ భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తిరస్కరించారు. సామాన్య పౌరుడిలా ఏ కేటగిరీలో వుంటానని.. కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

బ్యాలెట్‌పై నమ్మకం లేకుండా .. బుల్లెట్‌పై నమ్మకం పెట్టుకుని తన కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన వారు ఎవరంటూ లోక్‌సభలో ప్రశ్నించారు మజ్లీస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాను చావుకు భయపడటం లేదని.. తనకు ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదన్నారు. సామాన్య పౌరుడిలా ఏ కేటగిరీలో వుంటానని.. కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. సోమవారం లోక్‌సభలో అమిత్ షా దీనిపై ప్రకటన చేస్తారని పీయూష్ గోయల్ వెల్లడించారు. 

కాగా.. అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi)పై గురువారం ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు(Firing) జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ప్రచారానికి వెళ్లారు. హాపూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై  కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హాపూర్ కోర్టులో వీరిద్దరిని హాజరు పరిచి కస్టడీలోకి తీసుకోవడానికి న్యాయస్థానాన్ని కోరుతామని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే, ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నదని వివరించారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు సచిన్, శుభమ్‌లను అరెస్టు చేశారు. వీరిద్దరి గురించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీరిద్దరికీ గతంలో నేరచరిత్ర ఏమీ లేదు. కానీ, ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఇందులో ఒకరు సోషల్ మీడియాలో ద్వేషపు పోస్టులు పెట్టినట్టు సమాచారం.

నిందితుడు సచిన్ నోయిడాలోని బాదల్‌పుర్‌ నివాసి. ఆయన ఎల్ఎల్ఎం చేసినట్ట చెప్పారని పోలీసులు వివరించారు. ఈయనకు ఓ ఫేస్‌బుక్ పేజీ ఉన్నది. పేరు.. దేశ్‌భక్త్ సచిన్ హిందు. ఈ పేజీలో ఆయన చేసిన కొన్ని పోస్టులు మతపరమైన ద్వేషంతో నిండి ఉన్నట్టు తెలిసింది. అలాగే, శృతిమించిన(?) జాతీయవాదంతో ఉన్నట్టు సమాచారం. 2018 జూన్ 1వ తేదీన అసదుద్దీన్ ఒవైసీ ఫోటో పోస్టు చేశారు. అందులో ఒవైసీని చూపిస్తూ ఉండే ఓ ఖడ్గం ఉన్నది. మరో పోస్టులో ప్రధాని మోడీ.. నాకు ఆర్‌డీఎక్స్ బాంబ్ పెట్టండి.. ఆ తర్వాత నన్ను పాకిస్తాన్‌లో విసిరేండి.. అందుకు నేను సిద్ధం అంటూ ఆవేశంగా ఓ పోస్టు పెట్టారు. భారత మాత కోసం ఎందరో వీరులు చేసిన త్యాగాల రుణం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

సచిన్ అరెస్టు తర్వాత పోలీసులు ఆయన కుటుంబాన్ని కనీసం ఐదు నుంచి ఆరు గంటలపాటు విచారించారు. సచిన్ తండ్రి వినోద్ 20 నుంచి 25 కంపెనీలకు లేబర్లను అందించే పని చేస్తుంటాడు. సచిన్ కూడా అందులో తోడుగా పని చేస్తుంటాడని వివరించాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సచిన్ ఇల్లు విడిచి బయటకు వెళ్లాడని, ఓ కంపెనీ పని మీదనే బయటకు వెళ్తున్నట్టు చెప్పాడని తెలిపాడు. ఎందుకో తెలియదు కానీ, రెండు మూడు రోజులుగా తన కొడుకు అప్‌సెట్ అయ్యాడని పేర్కొన్నాడు. సహరన్‌‌పూర్‌కు చెందిన సంప్లా బేగంపూర్ వాసి శుభమ్. ఆయన తల్లిదండ్రలు మరణించారు. సోదరికి పెళ్లి అయింది. పదో తరగతి పాస్ అయిన శుభమ్ సాగు సంబంధ పనులు చేసుకుంటుంటాడు. ఎక్కువ సొంతూరులో ఉండరు. గజియాబాద్‌లోని మోదిపురంలో ఉంటాడని స్థానికులు చెప్పారు. 

అయితే, విచారణలో వీరిద్దరూ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ చేసే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిపారని పోలీసువర్గాలు వివరించాయి. సోషల్ మీడియాలో ఒవైసీ స్పీచ్‌లను వారు వింటూ ఉంటారని తెలిపాయి. అయోధ్య రామ మందిరం, రామ జన్మభూమి వివాదంపై ఒవైసీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు వారిద్దరూ పేర్కొన్నట్టు వివరించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఒవైసీ వస్తున్నట్టు తమకు తెలిసిందని, అక్కడే ఆయన అంతుచూడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి. ఈ ఇద్దరి దగ్గర నుంచి కంట్రీ మేడ్ పిస్టోల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యంగా ఉన్న మరో ఇద్దరి పేర్లనూ వారి ప్రకటించారని,  వారి కోసం గాలింపులు జరుగుతున్నాయని తెలిపారు.

అసదుద్దీన్ కారుపై దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో.. ఆయనకు భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ భద్రతపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్‌తో జెడ్ కేటగిరి భద్రతా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తక్షణమే అసదుద్దీన్‌కు ఈ భద్రత అమల్లోకి రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu