
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని 'చౌకీదార్' అని, రాహుల్ గాంధీని 'దుకాణ్ దారు' అని అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఒవైసీ మాట్లాడుతూ.. 'ముస్లింలపై జరుగుతున్న అణచివేతపై ప్రధాని నరేంద్ర మోదీ గానీ, రాహుల్ గాంధీ గానీ మాట్లాడరనీ, వారిలో ఒకరు దుకాణదారు, మరొకరు చౌకీదార్ అని ఎద్దేవా చేశారు.
దేశంలో అవినీతిని అరికట్టడానికి ప్రధాని మోదీ తరచుగా తనను తాను 'చౌకీదార్' అని చెప్పుకుంటున్నారనీ, ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాహుల్ గాంధీ ' దుకాన్' అనే పదాన్ని తరుచు ఉపయోగించారని విమర్శించారు. అలాగే.. విపక్ష కూటమిలో చేరే ఆలోచన లేదని ఏఐఎంఐఎం నేత తెల్చి చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎను 'ప్రేమికుడు' అని, 'ఇండియా' కూటమిని 'ప్రేమికురాలు' అని ఒవైసీ అభివర్ణించారు. వీరిద్దరి ప్రేమ దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు.
మత స్వేచ్ఛ అంతం - ఒవైసీ
ప్రధాని నరేంద్ర మోదీపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అవిశ్వాసానికి మద్దతిస్తోందని, ప్రతిపక్ష కూటమికి కాదని అన్నారు. అదే సమయంలో.. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమలు చేస్తే ప్రజల మత స్వేచ్ఛ అంతరించిపోతుందని అన్నారు.
బిల్కిస్ బానోకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది?
యూసీసీ ద్వారా మహిళా సాధికారత కల్పన జరుగుతోందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. గ్యాంగ్‌రేప్ బాధితురాలు బిల్కిస్ బానోకు ప్రధాని ఇంతవరకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. అదే సమయంలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సు గురించి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మణిపూర్ అంతర్యుద్ధాన్ని ఇతర దేశాల జీ-20 నేతలకు చూపిస్తారా ? అని ప్రశ్నించారు.