అక్కడ పీల్చే గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

By telugu team  |  First Published Nov 6, 2021, 7:16 PM IST

ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. అక్కడ వాతావరణంలోని గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరంగా ఉన్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఈ పరిస్థితులు కరోనా వైరస్‌కూ కలిసి వస్తాయని హెచ్చరించారు. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు.
 


న్యూఢిల్లీ: వాయు కాలుష్యం క్రమంగా తీవ్రమవుతున్నది. పంట వ్యర్థాలను కాల్చడం, పరిశ్రమల నుంచి పొగ వెలువడటం, వాహనాల ఉద్గారాలు వెరసి పీల్చే గాలి ప్రమాదకరంగా మారుతున్నది. Air Pollution గురించిన చర్చ జరిగినప్పుడు దేశ రాజధాని Delhi కచ్చితంగా చర్చకు వస్తుంది. ఢిల్లీలో వాయువులు ప్రమాదకరంగా మారాయి. ఎంతగా కలుషితమయ్యాయంటే ఇక్కడి వాయువులు సిగరెట్ పొగ కంటే ప్రమాదకరంగా ఉన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియానే ఈ విషయాన్ని పేర్కొన్నారు.

ఢిల్లీ కాలుష్యంపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడారు. ఢిల్లీలో వాయువులు Cigarette Smoke కంటే ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. ఈ కాలుష్యం ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణాలను గణనీయంగా తగ్గించే ముప్పు ఉన్నదని వివరించారు. ఢిల్లీ వాసుల జీవిత కాలం(Life Expectency) వాయు కాలుష్యం కారణంగా చాలా తగ్గిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. ఆ డేటాను ఇంకా అధికారికంగా గుర్తించాల్సి ఉన్నప్పటికీ వాయు కాలుష్య కచ్చితంగా ఆయుర్దాయాన్ని తగ్గిస్తుందని వివరించారు. ఢిల్లీ ప్రజల శ్వాసకోశాలు నల్లగా మారుతున్నాయని పేర్కొన్నారు.

Latest Videos

undefined

Also Read: దీపావళి బాణసంచా ఎఫెక్ట్: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయు కాలుష్యం

Diwali సందర్భంగా చాలా మంది బాణాసంచా చెప్పుకోదగ్గ స్థాయిలో కాలుష్యాన్ని కలిగించదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని డాక్టర్ రణదీప్ గులేరియాతో ప్రస్తావించగా సమాధానమిచ్చారు. గంగా నదీ పరివాహకంలో కాలుష్యం అత్యధికంగా ఉన్నదని తెలిపారు. అయితే, దీపావళి రోజున బాణాసంచా కాల్చడమూ కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతుందనీ వివరించారు. అంతేకాదు, పండుగ సందర్భంగా వాహనాల కదలికలూ పెరుగుతాయని, వాహన ఉద్గారాల ద్వారా కూడా ఎక్కువగానే వాయు కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు.

ఎప్పటి నుంచో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధికంగానే నమోదవుతున్నది. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడ వాయు కాలుష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మంచు కాలుష్య పదార్థాలతో చేరి ఢిల్లీలో ఎదుటి మనిషి కూడా కనిపించని దుస్థితి ఏర్పడుతుంది. దీపావళి గడిచి రెండు రోజులవుతున్నప్పటికీ వాయు కాలుష్యం తీవ్రంగానే ఉన్నది. 2017 తర్వాత దీపావళి అనంతరం అత్యధిక వాయు కాలుష్యం ఈ సారే నమోదైంది. ఫైర్ క్రాకర్లు, పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వాయు కాలుష్యం అధికమైంది. ఢిల్లీలో 24 గంటల సగటు ఏక్యూఐ 462గా రికార్డ్ అయినట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శుక్రవారం వెల్లడించింది.

Also Read: దీపావళి రోజు పిల్లలను పటాకులు కాల్చనివ్వండి.. వారి కోసం ఇలా చేయండి.. సద్గురు జగ్గీ వాసుదేవ్ సందేశం..

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వాయు కాలుష్యంతోపాటు కరోనా మహమ్మారినీ ప్రస్తావించారు. కలుషిత ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తీవ్రత పెరిగే అవకాశముందని ఆయన వివరించారు. ఈ కలుషిత ప్రాంతాల్లో పేషెంట్‌ల ఊపిరితిత్తుల్లో వాపు కనిపిస్తుందని తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ కాలుష్య పదార్థాలతో అంటిపెట్టుకుని ఉండి ఎక్కువ సేపు వాతావరణంలో ఉండే ముప్పు ఉంటుందని అన్నారు. తద్వారా వాతావరణం నుంచి కరోనా వైరస్ వేగంగా తొలగిపోదని తెలిపారు.

శనివారం ఉదయం కూడా ఢిల్లీలోని చాలా వరకు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్‌లు వాయు కాలుష్యం తీవ్రంగానే ఉన్నదని తెలిపాయి. గాలులు వీస్తే కాలుష్యం నుంచి కొంత ఊరట లభించే అవకాశముందని పేర్కొన్నాయి.

click me!