Agnipath: అగ్నిపథ్‌పై రెండేళ్లుగా కసరత్తులు జరిగాయ్.. యువతకు ఇది సదవకాశం: ఇండియన్ నేవీ చీఫ్

Published : Jun 20, 2022, 08:30 PM IST
Agnipath: అగ్నిపథ్‌పై రెండేళ్లుగా కసరత్తులు జరిగాయ్.. యువతకు ఇది సదవకాశం: ఇండియన్ నేవీ చీఫ్

సారాంశం

అగ్నిపథ్ స్కీంపై ఇండియన్ నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కీం ఇప్పటికిప్పుడు రూపొందించినది కాదని, రెండేళ్లుగా ఈ స్కీం గురించి కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. అలాగే, ఈ స్కీం అభ్యర్థులు తాము సైన్యంలో ఇమిడిపోగలమా? లేదా? అనే తెలుసుకునే సదవకాశం ఉంటుందని, ఇమిడిపోకుంటే బయటకు వెళ్లవచ్చని, లేదంటే.. అందులోనే కొనసాగడానికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.  

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా ఇండియన్ నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీంను ఏదో ఉన్నపళంగా ప్రకటించలేదని, అలా విమర్శలు చేసే వారు తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారని కొట్టిపారేశారు. ఎందుకంటే.. అగ్నిపథ్ స్కీం గురించి రెండేళ్లుగా కసరత్తులు జరిగాయని, సంప్రదింపులు, చర్చలు జరిగాయని వివరించారు.

కార్గిల్ కమిటీ రిపోర్టు వచ్చినప్పటి నుంచే ఈ స్కీం గురించి మంతనాలు ప్రారంభం అయ్యాయని వివరించారు. భద్రతా బలగాల్లో ఏజ్ ప్రొఫైల్‌ను కుదించాలనే ప్రతిపాదన వచ్చిందని, ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో యంగ్ ఏజ్ ప్రొఫైల్ ఉంటే వారు పోరాటానికి సరిగ్గా సరిపోతారనే చర్చ వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి ఈ విషయంపై అనేక విధాలుగా చర్చలు జరిగాయని, ఆ చర్చల నుంచే అగ్నిపథ్ స్కీం ఉద్భవించిందని చెప్పారు.

ఈ స్కీం గురించి కూడా సర్వీస్ హెడ్‌క్వార్టర్స్, ఫైనాన్స్ మినిస్ట్రీ, స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీలు సహా పలుశాఖలతో చర్చలు జరిగాయని, అగ్నిపథ్ స్కీం అమలు చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయని దీర్ఘంగా చర్చలు జరిగాయని వివరించారు.

నాలుగేళ్ల ఉద్యోగంపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. అగ్నిపథ్ స్కీం ఆర్మీలో చేరితే ఎలా ఉంటుందని పరిశీలించాలనుకునే యువతకు ఇది సదవకాశం అని వివరించారు. ఎందుకంటే.. ఆర్మీలో ఉద్యోగం వారికి సరిపోతుందో లేదో తెలుసుకునే సౌలభ్యం ఈ స్కీం ద్వారా లభిస్తుందని తెలిపారు. కొందరు ఆర్మీలో చేరిన తర్వాత తాము తప్పు చేశామనే అభిప్రాయాల్లో ఉంటారని, ఈ ఉద్యోగం తనకు సరిపోదనే అభిప్రాయాలు కలిగి ఉంటారని కానీ, వారు మధ్యలోనే ఉద్యోగం నుంచి విరమించుకునే అవకాశాలు వారికి లేవని అన్నారు. కానీ, అగ్నిపథ్ స్కీం ద్వారా ఇలా తాము సైన్యంలో ఇమడగలమో లేదో తెలుసుకోవడానికి ఇది సరైన పథకం అని చెప్పారు. 

ఈ స్కీం ద్వారా సైన్యంలో చేరిన వారు ఇకపై కొనసాగవద్దనే నిర్ణయాలకు వచ్చిన వారు ఉంటారని, వారు కాలంలో పొందిన శిక్షణను లబ్దిపొందుతారని, ఆ శిక్షణ వారికి వారి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వారు ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే దృఢ చిత్తం, ధైర్య సాహసాలను పెంపొందించుకుని ఉంటారని వివరించారు. కాబట్టి, నాలుగేళ్ల తర్వాత వారు నిరుద్యోగులని తాను భావించనని, వారు విలువైన శిక్షణ పొంది సమాజంలో అందరూ కోరుకునే వారిగా ఉంటారని భావిస్తానని పేర్కొన్నారు. ఉద్యోగంలో పెట్టుకోవాలని సంస్థలు ఆరాటపడే ఆస్తులుగా వారు సొసైటీలో ఉంటారని వివరించారు.

అలాగే, హింసాత్మక ఆందోళనలకు పాల్పడుతున్న యువతకూ ఆయన సందేశం ఇచ్చారు. ఆందోళనలకు దిగడం పూర్తిగా తప్పు అని, ఈ హింసాత్మక ఆందోళనలు దేనినీ పరిష్కరించలేవని ఆయన వివరించారు. అందుకే వారు స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అర్థం చేసుకోవాలని సూచించారు. అలా చేస్తే.. ఈ స్కీం వారికి కల్పించే అవకాశాలు అనేకం అని తెలియవస్తుందని వివరించారు. ఈ స్కీం ద్వారా వారు ఏం పొందుతున్నారు అనే కోణంలో చూడాలని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?