Agniveers: అగ్నివీరుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. బీజేపీ నేత కైలాష్‌ విజ‌య‌వ‌ర్గీయ పై కేసు !

By Mahesh RajamoniFirst Published Jun 22, 2022, 9:52 AM IST
Highlights

Agnipath: బీజేపీ సీనియ‌ర్ నేత కైలాష్ విజయవర్గియా ఓ ప్ర‌క‌ట‌నలో త‌మ పార్టీ కార్యాల‌యాల్లో ‘అగ్నివీర్స్’ ను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవడానికి తాను ఇష్ట‌ప‌డుతాన‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమార‌మే రేపుతున్నాయి.  
 

Complaint filed against Vijayvargiya: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ పై వివాదం కొన‌సాగుతూనే ఉంది. ఈ ప‌థ‌కాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని దేశ యువ‌త‌, ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తుండ‌గా, వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే నాలుగు సంవ‌త్స‌రాల ఆర్మీ సేవ‌ల త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న అగ్నివీర్స్ పై బీజేపీ నాయ‌కులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ర‌చ్చ చేస్తున్నాయి. ఆయా నాయ‌కుల‌పై స‌ర్వత్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే అగ్నివీరుల‌పై బీజేపీ నాయ‌కుడు కైలాష్ విజ‌య‌వ‌ర్గీయ చేసిన వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదుచేశారు. హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లోని ఆయ‌న పై కేసు న‌మోదైంది. బీజేపీ పార్టీ కార్యాలయంలో భద్రత కోసం అగ్నివీర్లను నియమించాలని చేసిన వ్యాఖ్యలపై విజయవర్గీయపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మంగళవారం ఫిర్యాదు చేశారు.

సైనికులను, సైన్యాన్ని అవమానించేలా విజయవర్గియా వ్యాఖ్యలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. తన బీజేపీ  కార్యాలయంలో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్లకు ప్రాధాన్యత ఇస్తానని బీజేపీ నేత విజ‌య వ‌ర్గీయ అన్నారు. “నేను అగ్నివీర్‌ని బీజేపీ కార్యాలయంలో సెక్యూరిటీగా నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని తన సెక్యూరిటీ గార్డుగా నియమించుకున్నారు. అతను సైనికుడు కాబట్టి నాకు భయం లేదు. అంటే సైనికుడు అంటే ఆత్మవిశ్వాసానికి పేరు'' అని విజయవర్గీయ అన్నారు. వి హ‌నుమంత రావు ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకాన్ని దుయ్యబట్టారు. “నాలుగేళ్ల పాటు ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత వదిలివేసేటప్పుడు 11 లక్షలు ఇస్తామని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ఏం చేస్తారు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు. కూలి పనులు లేక వ్యవసాయం చేయాల్సి వస్తోంది. గతంలో 15 నుంచి 20 ఏళ్ల పదవీకాలం ఉండగా ఇప్పుడు నాలుగేళ్లకు తగ్గించారు” అని మండిప‌డ్డారు.

“అగ్నిప‌థ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసను చూశారు. ఈ సమయంలో, ఆర్మీ చీఫ్ మేము అగ్నిపథ్‌లో వెనక్కి వెళ్లబోమని చెప్పారు. ఇది సరికాదు” అని ఆయన అన్నారు. మరో వైపు బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అగ్నివీరులను బీజేపీ కార్యాలయంలో భద్రత కోసం తీసుకుంటాం అని అన్నారు. ప్రజలను రక్షించే, దేశానికి భద్రత కల్పించే సైనికులు మరియు సైన్యాన్ని ఇది చాలా అవమానకరం. అందుకే బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను అని హ‌నుమంత‌రావు చెప్పారు. భారత సైనికులను అవమానించారని పేర్కొంటూ తక్షణమే చర్యలు తీసుకుని విజయవర్గీయను అరెస్టు చేయాలని అభ్యర్థించినట్లు ఆయ‌న తెలిపారు. “గతంలో ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు మౌనంగా ఉన్నారు. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్, కాబూల్‌లో వారు గురుద్వారాపై దాడి చేశారు. 50 మంది మరణించారు. ప్రపంచం మొత్తం ఈ విషయంపై స్పందిస్తోంది. మరో పక్క బీజేపీ జనరల్ సెక్రటరీ ఇలా మాట్లాడడం అవమానకరమని అందుకే ఫిర్యాదు చేశానని, వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరారు. ఆయ‌న భార‌త సైనికుల‌ను అవ‌మానించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

click me!