చనిపోయిన వ్యక్తి మృతదేహంపై కూర్చుని అఘోరాలు పూజలు చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. గుండెపోటుతో మరణించిన వ్యక్తి దహనసంస్కారాల సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది.
చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఒళ్లు జలదరించే ఘటన వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి మృతదేహంపై కూర్చుని అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం…స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. తిరుచి జిల్లా లాల్గుడి సమీపంలోని పూవలూరుకు చెందిన బాలసుబ్రమణ్యం అనే ఓ 60 ఏళ్ల టీ మాస్టర్ సోమవారం నాడు గుండెపోటుతో మృతి చెందాడు.
అంత్యక్రియల్లో భాగంగా బంధువులు బాలసుబ్రమణ్యం మృతదేహాన్ని తీర్చి ఓయామారి స్మశాన వాటికకు తీసుకువెళ్లారు. అక్కడ ఆయనకి దహన సంస్కారాలు నిర్వహించడానికి అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో బాలసుబ్రమణ్యం బంధువైన శరవణన్ అనే వ్యక్తి మృతదేహానికి అఘోరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని, ఆ తర్వాత దహన సంస్కారాలు చేయాలని నిర్ణయానికి వచ్చాడు.
దీనికోసం తిరుచి అరియామంగళంలో బసచేసి ఉన్న మణికంఠన్ అనే అఘోరాని సంప్రదించాడు. అతని అభ్యర్థన మేరకు ఆ అఘోర తన శిష్యులతో కలిసి స్మశానవాటికకు వచ్చాడు. పూజల్లో భాగంగా బాలసుబ్రమణ్యం మృతదేహంపై అఘోర మణికంఠన్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అలా కూర్చుని మంత్రాలు చదువుతుండగా.. శిష్యులు డమరుకాన్ని మోగిస్తూ.. అరగంటసేపు పూజలు చేశారు.
ఈ పూజల అనంతరం కుటుంబ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం మృతదేహానికి దహన క్రియలు పూర్తి చేశారు. స్మశానంలో జరిగిన ఈ తంతు గురించి తెలిసిన స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.