మరోసారి చర్చకు నెహ్రూ.. విభజన వీడియోతో బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్ కౌంటర్

Published : Aug 14, 2022, 01:17 PM ISTUpdated : Aug 14, 2022, 01:19 PM IST
మరోసారి చర్చకు నెహ్రూ.. విభజన వీడియోతో బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్ కౌంటర్

సారాంశం

జవహర్ లాల్ నెహ్రూ మరోసారి చర్చకు వచ్చారు. దేశ విభజన గాయాల స్మృతి దినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఓ వీడియోను ట్వీట్ చేసింది. అందులో నెహ్రూను బ్లేమ్ చేస్తూ విభజన గాయాలు పేర్కొంది. కాగా, కాంగ్రెస్ ఈ వీడియోకు కౌంటర్ ఇచ్చింది. బీజేపీ వర్షన్‌కు తనదైన వర్షన్ వివరించింది.

న్యూఢిల్లీ: దేశ విభజన దినం సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరోసారి చర్చకు వచ్చారు. నెహ్రూను టార్గెట్ చేస్తూ బీజేపీ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దేశ సంస్కృతి, సభ్యత, మూలం, తీర్థాలు, ఆధ్యాత్మికత గురించి తెలియని వారు దేశాన్ని విభజించేశారని మండిపడింది. ఈ ట్వీట్ కాంగ్రెస్‌ ప్రతిస్పందనను తెచ్చింది. కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ ఈ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు.

ఆగస్టు 14వ తేదీని కేంద్ర ప్రభుత్వం దేశ విభజన గాయాల స్మృతి దినంగా గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు భారత్ రెండో విభజన గాయాల స్మృతి దినాన్ని గుర్తు చేసుకుంటున్నది. 

బీజేపీ తన వైఖరిలో సుమారు 7 నిమిషాల నిడివితో ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో బీజేపీ కోణంలో దేశ విభజనకు దారి తీసిన అంశాలు, కారకులను పేర్కొంది. ముహమ్మద్ అలీ జిన్నా సారథ్యంలోని ముస్లిం లీగ్ డిమాండ్లకు నెహ్రూ మోకరిల్లాడని, అందుకే దేశం విభజన జరిగిందని ఆరోపించింది. అంతకు ముందు బంగ్లాదేశ్‌ను విడగొట్టాలని బ్రిటీష్ భావించి ప్రయత్నిస్తే.. దేశమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపింది. దీంతో విభజన సాధ్యం కాదని బ్రిటీష్ వారు మానుకున్నారని పేర్కొంది. కానీ, సుమారు 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కారణంగా బ్రిటీష్ వారికి పాకిస్తాన్ విభజన సాధ్యం అయిందని వివరించింది.

బీజేపీ ఈ ట్వీట్ చేయగానే కాంగ్రెస్ నేత, ఎంపీ జైరాం రమేశ్ కౌంటర్ ఇచ్చారు. దేశ విభజన గాయాల స్మృతికి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం వెనుక ప్రధాని మోడీ ముఖ్య ఉద్దేశ్యం తన రాజకీయాల కోసమేనని విమర్శించారు. తన రాజకీయ పోరాటానికి మేతగా ఈ విభజన గాయాలను మళ్లీ తెరమీదకు తెచ్చారని పేర్కొన్నారు. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు దేశాన్ని విభజించే పనిని కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. విభజన విషాదాన్ని విద్వేషానికి, తప్పుడు అవగాహన తేవడానికి ఉపయోగించరాదని హెచ్చరించారు. అంతేకాదు, బీజేపీ వర్షన్‌కూ ఆయన కౌంటర్‌గా వివరణ ఇచ్చారు. 

నిజానికి ద్విజాతి సిద్ధాంతాన్ని సావర్కర్ ప్రతిపాదించాడని, జిన్నా దాన్ని అమలు చేశాడని పేర్కొన్నారు. ఇప్పుడు మనం దేశ విభజనను అంగీకరించకుంటే.. మరెన్నో ముక్కులుగా దేశం విభజించిపోయే ముప్పు ఉన్నదని సర్దార్ పటేల్ రాశాడని తెలిపారు. శరత్ చంద్ర  బోస్‌కు వ్యతిరేకంగా బెంగాల్ విభజనకు ముందుగా అడుగేసిన జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీని కూడా ప్రధాని ఒక సారి గుర్తు చేస్తే బాగుంటుందని చురకలు అంటించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu