ఎన్నికల బరిలో ఓడిన అభ్యర్థి.. కోర్టు తీర్పుతో ఎంపీ అయ్యాడు.. ఇంతకీ ఏం పిటిషన్ వేశాడంటే?

By Mahesh KFirst Published Sep 24, 2022, 2:45 PM IST
Highlights

మణిపూర్‌లో గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన ఎంపీ.. చెల్లుబాటు కాకుండా పోయాడు. ఆ ఎన్నికలో పరాజయం పాలైన బీజేపీ నేత ఇప్పుడు కొత్త ఎంపీ అయ్యాడు. మూడేళ్లు ఎంపీగా చేసిన తర్వాత ఆయన దిగిపోవాలని మణిపూర్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఓడిన బీజేపీ అభ్యర్థి పిటిషన్ ఏం వేశారంటే..?

మణిపూర్: మణిపూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మణిపూర్ హైకోర్టు తీర్పుతో ఎంపీ ఎన్నిక చెల్లకపోవడమే కాదు.. ఓడిన అభ్యర్థి ఎంపీ అయ్యాడు. బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చిన తీర్పు. పరాజయం తర్వాత కూడా తన పోరాటాన్ని ఆపలేదు. ఎన్నికల బరిలో ఓడిపోయాక.. కోర్టులో గెలిచి ఎంపీ అయ్యాడు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి లార్హో ఎస్ ఫోజె బరిలోకి దిగాడు. బీజేపీ నుంచి హోలిమ్ షోఖోపావ్ మాతె పోటీ చేశాడు. ఈ ఎన్నికలో నాగా పీపుల్స్ ఫ్రంట్ లార్హో ఎస్ ఫోజె 3,63,527 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బీజేపీ అభ్యర్థి హోలిమ్ షోఖోపావ్ మాతె 2,89,745 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీంతో నాగా పీపుల్స్ ఫ్రంట్ నేత లార్హో ఎస్ ఫోజె ఎంపీ అయ్యాడు.

కానీ, బీజేపీ నేత తన పోరాటాన్ని ఎన్నికల బరిలో ఓటమితో వదిలిపెట్టుకోలేదు. హైకోర్టు వరకు ఆ పోరాటాన్ని తీసుకెళ్లి.. న్యాయస్థానంలో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నేత లార్హో ఎస్ ఫోజె తన ఎన్నికల అఫిడవిట్‌ తప్పుల తడకగా ఉన్నదని, కీలకమైన విషయాలను నింపకుండా బ్లాంక్‌గా వదిలిపెట్టాడని బీజేపీ నేత కోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ పేపర్లతోపాటు సమర్పించి అఫిడవిట్‌‌ను నిబంధనలకు లోబడి నింపలేదని ఆరోపించాడు. లార్హో ఎస్ ఫోజె తన చర, స్థిరాస్తులు, తన భార్య, తనపై ఆధారపడిన వారి చరాస్తులు, స్తిరాస్తుల వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నాడు. ఎన్నో కీలకమైన మెటీరియల్ ఫ్యాక్ట్‌లను దాచి పెట్టాడని తెలిపాడు. ప్రమాణంపైనా తప్పుడు ప్రకటనలు చేశాడని వివరించాడు. తద్వారా ఆ అభ్యర్థి తన గెలుపును సుసాధ్యం చేసుకున్నాడని బీజేపీ
అభ్యర్థి మణిపూర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంవీ మురళీధరన్ ఏకసభ్య ధర్మాసనం విచారించింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి లార్హో ఎస్ ఫోజె లోక్‌సభ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. మూడేళ్ల తర్వాత లార్హో ఎస్ ఫోజె ప్రాతినిధ్యం చెల్లదని పేర్కొంది. అంతేకాదు, బీజేపీ అభ్యర్థి హోలిమ్ షోఖోపావ్ మాతెను కొత్త ఎంపీగా ప్రకటించింది.  

తనను ఎంపీగా డిక్లేర్ చేయాలని పిటిషనర్ చేస్తున్న వాదనలో లోపమేమీ లేదని ఏకసభ్య ధర్మాసనం తెలిపింది. ఎందుకంటే.. ఈ ఎన్నికలో లార్హో ఎస్ ఫోజె తర్వాత అత్యధిక ఓట్లు గెలుచుకున్న అభ్యర్థి బీజేపీ నేత హోలిమ్ షోఖోపావ్ మాతెనే అని వివరించింది.

click me!