పదవికి రాజీనామా.. రాజకీయాల్లోకి వెళతారంటూ ప్రచారం: స్పందించిన బీహార్ డీజీపీ

By Siva KodatiFirst Published Sep 23, 2020, 3:18 PM IST
Highlights

బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఎం నితీశ్ కుమార్‌ను విమర్శించినందుకు గాను బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై మండిపడిన ఆయన ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన  పదవికి రాజీనామా చేశారు

బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఎం నితీశ్ కుమార్‌ను విమర్శించినందుకు గాను బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై మండిపడిన ఆయన ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తన  పదవికి రాజీనామా చేశారు.

అయితే దీనిపై బీహార్ ప్రభుత్వ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి చేరడానికే రాజీనామా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాండే వీఆర్ఎస్ తీసుకుని పాండే ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది.

1987 బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ద్వారా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

మంగళవారంతో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి. ఈ క్రమంలో తాను రాజకీయాల్లో చేరతానంటూ వస్తున్న వార్తలపై పాండే స్పందించారు. తాను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరేది లేదని, దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

తనకు సమాజ సేవ చేయాలని వుందని.. దీనికోసం రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని పాండే వెల్లడించారు. ఆయన గతంలో కూడా ఒకసారి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లోకి చేరి బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు.

కానీ ఆయన కోరిక నెరవేరలేదు. దీంతో చేసేది లేక రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరిగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు నితీశ్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేను విధుల్లోకి తీసుకున్నారు. 

click me!