41 ఏళ్ల తర్వాత తమిళనాడు నుంచి శ్రీలంకకు సముద్రయానం పున:ప్రారంభం

By Mahesh K  |  First Published Oct 14, 2023, 6:01 PM IST

తమిళనాడు నుంచి ఉత్తర శ్రీలంకకు మధ్య ప్రయాణ సేవలు 41 ఏళ్ల తర్వాత మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. నాగపట్టిణం నుంచి కంగెసంతురై పోర్టు వరకు ప్రయాణికులను తీసుకెళ్లడానికి సముద్రయాన సేవలను ప్రారంభించారు.
 


న్యూఢిల్లీ: తమిళనాడు, ఉత్తర శ్రీలంకకు చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, పోలికలు ఎక్కువ. ఈ రెండు ప్రాంతాలకు నడుమ రాకపోకల కోసం తమిళులు తపిస్తూ ఉంటారు. శ్రీలంకకు వెళ్లినా కొలంబోకు వెళ్లి మళ్లీ ఉత్తరం వైపు వెనక్కి రావాల్సి ఉంటుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే ఒక విమానం ఇప్పుడు తమిళనాడు నుంచి ఉత్తర శ్రీలంకకు మధ్య సేవలు అందిస్తున్నది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. 41 ఏళ్ల తర్వాత తమిళనాడు, ఉత్తర శ్రీలంకకు నడుమ సముద్ర యానాన్ని పునరుద్ధరించింది. నాగపట్టిణం నుంచి కంగెసంతురై పోర్టు వరకు ప్రయాణికులను తీసుకెళ్లడానికి సముద్రయాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణ సేవలను కేంద్ర మంత్రి సర్బానంద సోనవాల్, తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి ఈవీ వేలు ప్రారంభించారు. ఈ సేవలను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. 

చెన్నై నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళనాడుకు చెందిన నాగపట్టిణం నుంచి సుమారు మూడు గంటలు 60 నాటికల్ మైళ్లు సముద్రం మీదుగా ప్రయాణించి కంగెసందురై పోర్టుకు ప్రయాణికులు ఈ విధానంలో చేరుకుంటారు. ఉత్తర శ్రీలంక రాజధాని జాఫ్నా నగరానికి సమీపంగానే ఈ కంగెసందురై వ్యూహాత్మక పోర్టు ఉంటుంది. ఈ ప్రయాణానికి చార్జి రూ 7,700 (జీఎస్టీతో కలిపి). ప్రయాణికుడు తనతోపాటు 40 కిలోల సామానును తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే రామేశ్వరం నుంచి తలైమన్నార్‌కు ప్రయాణ సేవలను అందుబాటులోకి తేవడానికి ఉభయ దేశాలు పని చేస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.

Latest Videos

undefined

Also Read: ఇది ఆత్మహత్య కాదు, హత్య, తెలంగాణ యువత కలలను చంపడమే: బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ ఫైర్

1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం మొదలయ్యే వరకు ఇండియా, శ్రీలంకల మధ్య సముద్రమార్గం అందుబాటులోనే ఉండింది. అప్పుడు బోట్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ విధానంలో చెన్నై నుంచి కొలంబోకు రూట్ ఉండేది. చెన్నై నుంచి ట్రైన్ ద్వారా ధనుస్కోడికి, అక్కడి నుంచి పడవలో ఉత్తర శ్రీలంకలోని తలైమన్నార్ వరకు వెల్ళి అక్కడి నుంచి మరో ట్రైన్‌లో కొలంబోకు ప్రయాణికులు వెళ్లేవారు.

తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఉత్తర శ్రీలంకలోని తలైమన్నార్‌కు మధ్య ప్రయాణ సేవలు 1982లో రద్దయ్యాయి. అయితే, యూపీఏ 2 హయాంలో మళ్లీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినా ఐదు నెలలు మాత్రమే ఆ సేవలు కొనసాగాయి. ఆ తర్వాత సేవలు రద్దు అయ్యాయి.

click me!