ఐన్‌స్టీన్, డార్విన్ సిద్ధాంతాలు తప్పు.. కోర్టులో పిటిషన్.. సుప్రీం సమాధానం ఇదే

By Mahesh K  |  First Published Oct 14, 2023, 4:09 PM IST

సుప్రీంకోర్టులో విచిత్రమైన పిటిషన్ ఫైల్ అయింది. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, చార్లెస్ డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం తప్పు అని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆ రెండు సిద్ధాంతాలు తప్పులని తేల్చడంపై శ్రద్ధ పెట్టడం కంటే తన సొంత సిద్ధాంతంపై ఫోకస్ పెట్టాలని సూచించింది.
 


న్యూఢిల్లీ: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చార్లెస్ డార్విన్‌ల సిద్ధాంతాలు తప్పు అని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. తాను చిన్నప్పుడు పాఠశాల, కళాశాలల్లో ఈ సిద్ధాంతాలు చదివి విశ్వసించానని, కానీ, ఈ రెండు సిద్ధాంతాలూ తప్పు అని తనకు తెలియవచ్చిందని ఆ పిటిషనర్ పేర్కొన్నాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధంతాన్ని విశ్వసించడం వల్ల 2 కోట్ల మంది మరణించారని వాదించాడు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ పిటిషన్‌ను ఆర్టికల్ 32 కింద దాఖలు చేశాడు. భారత రాజ్యాంగానికి ఈ ఆర్టికల్ గుండె, ఆత్మ వంటిదని కోర్టు పేర్కొంది. పౌరులు వారి ప్రాథమిక హక్కులు పొందనప్పుడు కోర్టును ఆశ్రయించడానికి ఈ ఆర్టికల్ ఉపకరిస్తుందని తెలిపింది. 

Latest Videos

కానీ, ఈ కేసులో పిటిషనర్ రాజ్ కుమార్ కేవలం విజ్ఞాన సిద్ధాంతాలపై ఏర్పడిన ఆయన సొంత విశ్వాసాలను ఆధారం చేసుకుని ఈ పిటిషన్ వేశాడు.స్కూల్, కాలేజీలో చదివిన ఈ రెండు సిద్ధాంతాలు తనకు ఇప్పుడు తప్పు అనిపిస్తున్నాయని పేర్కొన్నాడు. ఇది రిట్ పిటిషన్ కాజాలదని, ఆయన ప్రాథమిక హక్కులను కాలరాయడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఆ రెండు సిద్ధాంతాలు తప్పు అని చెప్పాలని కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని, దానికి బదులు ఆ రెండు సిద్ధాంతాలకు బదులు తన సొంత సిద్ధాంతంపై దృష్టి పెట్టడం మంచిదని సుప్రీంకోర్టు ఆ పిటిషనర్‌కు సూచించింది. ఒక వేళ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చార్లెస్ డార్విన్ సిద్ధాంతాలతో విభేదిస్తే తన సొంత ఆలోచనలు, విశ్వాసాలను ప్రచారం చేసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం తెలిపింది.

Also Read: 40 ఏళ్ల తర్వాత ఆ 40 గ్రామాల్లో మళ్లీ పోలింగ్.. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మార్పు

‘నువ్వు నీ సొంత సిద్ధాంతాన్ని తయారు చేసుకో. దాన్ని ప్రచారం చేసుకో. సుదీర్ఘకాలం నుంచి ఇంకా మనుగడలోనే ఉన్న ఆ రెండు సిద్ధాంతాలు నీకు తప్పు అనిపిస్తే.. నీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయి’ అని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు సంబంధించినది కాదని స్పష్టం చేస్తూ కోర్టు డిస్మిస్ చేసింది.

click me!