ఆమె ఎవరితో, ఎక్కడైనా ఉండొచ్చు.. ఢిల్లీ హైకోర్టు

By telugu news teamFirst Published Nov 26, 2020, 9:50 AM IST
Highlights

సులేఖ అనే యువతి బబ్లూ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే.. తమ కుమార్తె పెళ్లి సమయంలో.. మైనర్ అని.. బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేశారని ఆరోపించారు.

మైనార్టీ తీరిన మహిళ.. తనకు నచ్చిన ప్రదేశంలో.. నచ్చిన వ్యక్తితో ఉండే హక్కు, స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఓ యువతి పెళ్లి విషయంలో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 20ఏళ్ల యువతి తన భర్తతో కలిసి జీవించాలని అనుకుంటే.. జీవించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.

జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రజినీశ్ భట్నాగర్‌ల ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలను తీసుకురావడంతో నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పును వెలువరించడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సులేఖ అనే యువతి బబ్లూ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే.. తమ కుమార్తె పెళ్లి సమయంలో.. మైనర్ అని.. బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేశారని ఆరోపించారు. కాగా.. తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను సులేఖ తోసిపుచ్చింది. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సులేఖను విచారించిన ధర్మాసనం.. ఆమె మేజర్ అని గుర్తించింది. తన ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పడంతో బబ్లూ నివాసం వద్ద భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

పిటిషనర్, సులేఖ తల్లిదండ్రులకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని లేదా జంటను బెదిరించవద్దని సలహా ఇవ్వాలని పోలీసులకు సూచించింది. సులేఖ సోదరి హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో అత్యవసర విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది.

వివాహాల్లో హిందూ, ముస్లిం అనే తేడాలను కోర్టు చూడదని.. వారు మేజర్లా కాదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని ఇటీవల యూపీకి చెందిన సలామత్-అలియా కేసులో అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మేజర్లకు తమ జీవితభాగస్వాములను ఎంపిక‌‌‌‌‌ చేసుకునే హక్కు ఉంటుందని, వారి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని హైకోర్టు తెలిపింది. ఇది భిన్నత్వంలో ఏకత్వమన్న భావనకే విరుద్ధమని తీర్పు చెప్పింది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాల్లో చొరబడటం అనేది వారి ఎంపిక స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని వ్యాఖ్యానించింది.

click me!