
దొంగలంటే డబ్బు, బంగారం , ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఏకంగా బ్రిడ్జినే మాయం చేసేస్తే. వినడానికి విడ్డూరంగా వుంది కదూ. కానీ ఇది నిజంగానే జరిగింది. అది కూడా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో . మలాడ్ ప్రాంతంలోని 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన మాయమైంది. అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థకు చెందిన బ్రిడ్జి ఇది. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గతేడాది జూన్‌లో ఈ తాత్కాలిక ఇనుప బ్రిడ్జిని ఏర్పాటు చేసింది అదానీ సంస్థ.
ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెన నిర్మించారు. దీంతో ఈ ఇనుప వంతెనను ఉపయోగించడం లేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఆ వంతెన ఉన్నట్లుండి మాయమైంది. నగరానికి గుండెకాయ వంటి ప్రాంతంలో, నిత్యం రద్దీగా వుండే ఏరియాలో ఆ ఇనుప వంతెన ఎలా మాయమైందో అర్ధం కాలేదు. దీనిపై అదానీ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలు విని పోలీసులే నోరెళ్లబెట్టారు. గ్యాస్ కట్టర్‌తో వంతెనను ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. ఒక భారీ వాహనంలో వాటిని తరలించామని నిందితులు చెప్పారు. అయితే నలుగురు నిందితుల్లో ఒకరికి వంతెన నిర్మాణ సమయంలో సంబంధం వుంది. ఇతను కాంట్రాక్ట్ పద్ధతిలో అదానీ సంస్థలో పనిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు అతడికి సహకరించారని, ఈ కేసులో ఇంకా ఎవరైనా వున్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.