భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడువనున్న కమల్ హాసన్.. ఎప్పుడంటే..? 

By Rajesh KarampooriFirst Published Dec 18, 2022, 5:27 PM IST
Highlights

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో డిసెంబర్ 24న తాను పాల్గొంటానని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆదివారం తెలిపారు. యాత్రలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ తనను ఆహ్వానించారని చెప్పారు.

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న భారత్ జోడో యాత్రలో పాల్గొనున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి నడవనున్నారు. కమల్‌ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం.. యాత్రలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ నటుడు కమల్ హాసన్ ను ఆహ్వానించారు. ఈ మేరకు కమల్ హాసన్ వచ్చే వారం రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీకి వెళ్లనున్నారు.  

కమల్ హాసన్ అధ్యక్షతన ఆదివారం మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పరిపాలన, కార్యవర్గ, జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. అనంతరం కమల్ హాసన్ మీడియాతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పార్టీ నిర్మాణం, బూత్ కమిటీ, 2024 ఎన్నికల సన్నాహక అంశాలపై చర్చించినట్టు తెలిపారు.

తాము  ముఖ్యమైన పర్యటన కోసం సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.ఈ విషయాన్ని పార్టీ సభ్యులు తెలియజేస్తారన్నారు. ఇతర పార్టీలతో పొత్తు గురించి ఏమీ చర్చించలేదనీ, ఆ అంశంపై తాము త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో డిసెంబర్ 24న తాను పాల్గొంటానని తెలిపారు. యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ తనను ఆహ్వానించారని తెలిపారు.  

భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశిస్తుందని, దాదాపు ఎనిమిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మీదుగా వెళ్లి చివరకు జమ్మూ కాశ్మీర్ కు చేరుకుంటుంది. ఈ యాత్రలో ఇప్పటివరకూ  పూజా భట్, రియా సేన్, సుశాంత్ సింగ్, స్వర భాస్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి,అమోల్ పాలేకర్ వంటి సినీ, టీవీ ప్రముఖులు పాల్గొన్నారు.

అలాగే  శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) సుప్రియా సూలే, నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రామదాస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో సహా పలువురు ప్రముఖులు వివిధ సందర్భాలలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

8 రాష్ట్రాల్లో పర్యటించి 100 రోజులు పూర్తి .. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన 'భారత్ జోడో యాత్ర' ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఎనిమిది రాష్ట్రాల మీదుగా సాగింది. శుక్రవారంతో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.

click me!