దేశద్రోహం కేసు.. సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్ట్

By telugu news teamFirst Published Feb 15, 2021, 7:41 AM IST
Highlights

ఈ డాక్యుమెంట్‌లో ట్విట్టర్‌లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి.

ప్రముఖ సామాజిక కార్యకర్త దిశరవి ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దిశారవి.. బెంగళూరు నగరానికి చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త కాగా.. దేశద్రోహం కేసులో ఆమెను అరెస్టు చేయడం గమనార్హం. దేశంలో ఇటీవల రైతులు ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేయడం గమనార్హం.

దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్ కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ సోషల్ మీడియాలో టూల్ కిట్ షేర్ చేయగా.. దానిని దిశా రవి అప్ లోడ్ చేశారు. కాగా.. ఈ టూల్ కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ దిశా రవి పై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు  చేశారు.

‘టూల్‌కిట్‌ గూగుల్‌ డాక్యుమెంట్‌ను ఎడిట్‌ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్‌లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు’అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌లో ట్విట్టర్‌లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి. దేశంలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చేందుకు ఆమె కుట్ర పన్నిందనే ఆరోపణలకు అసలైన సాక్ష్యం ఆ టూల్‌కిట్‌నేనని అంటున్నారు. ఆమె ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు.

దిశను ఢిల్లీ పోలీసులు బెంగళూరులోని నివాసంలో ఉండగా శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. టూల్‌కిట్‌ను ఈ నెల 3వ తేదీన దిశ ఎడిట్‌ చేశారనీ, ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో దిశ కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్‌కిట్‌ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్‌ చేశానని ఆమె తెలిపారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా వెల్లడించారు. 

మేజిస్ట్రేట్‌ దేవ్‌ సరోహా ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో టూల్‌కిట్‌ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్‌లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అలజడులను సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఈనెల 4వ తేదీన ఖలిస్తాన్‌ అనుకూల పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, దిశా రవి ‘ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌’అనే క్యాంపెయిన్‌కు సహ వ్యవస్థాపకురాలు. బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసి ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌ పనిచేస్తున్నారు. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దిశా నివాసం ఉంటున్నారు. కాగా, దిశ అరెస్టును సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

click me!