మహిళకు ఆటో డ్రైవర్ వేధింపులు.. పోలీసుల నుంచి పారిపోతూ.. వాహనం కిందపడి నిందితుడు మృతి..

By SumaBala BukkaFirst Published Nov 7, 2022, 1:39 PM IST
Highlights

మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న వాహనం కిందపడి అతను మృతి చెందాడు. 

న్యూఢిల్లీ : పోలీసులనుంచి తప్పించుకోబోయి ఓ నిందితుడు యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో జరిగింది. మహిళను వేధిస్తున్నాడనే ఆరోపణల మీద ఓ ఆటోరిక్షా డ్రైవర్‌ ను పోలీసులు పట్టుకొచ్చారు. అయితే, అతను పోలీసులనుంచి పారిపోయే ప్రయత్నంలో వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ మేరకు అధికారులు ఆదివారం తెలిపారు. మృతుడు మజ్ను కా తిల్లా ప్రాంతానికి చెందిన రాహుల్‌గా గుర్తించారు.

శనివారం రాత్రి 11:15 గంటలకు, 40 ఏళ్ల ఓ మహిళ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, మెట్రో స్టేషన్‌లో ఆటోరిక్షా డ్రైవర్ ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఆ మహిళ జీవనోపాధి కోసం ఈ-రిక్షా నడుపుతోంది. సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్ వెలుపల ప్రయాణికుల కోసం వేచి ఉన్న సమయంలో రాహుల్ తనను దుర్భాషలాడాడని, వేధించాడని ఆమె ఆరోపించింది.

కానిస్టేబుళ్లు రాకేష్, ప్రేమ్, నరేష్ ఆమెతో పాటు విధానసభ మెట్రో స్టేషన్‌కు వెళ్లి చూడగా మద్యం మత్తులో ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ కనిపించాడు. తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు రావాలని వారు అతడిని అడగగా అతను వారితో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చాడని అధికారి తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద, రాహుల్ తన ఆటోరిక్షాను పార్క్ చేస్తున్న సమయంలో.. అతని మీద ఫిర్యాదు చేసిన మహిళ దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించింది. దీంతో పోలీసు సిబ్బంది ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించారని డిసిపి తెలిపారు.

నాలుగోసారీ కూతురే పుట్టిందని వ్యక్తి ఆత్మహత్య.. కర్నాటకలో విషాదం...

అది చూసిన రాహుల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించలేదు. దీంతో వాహనం ఢీకొట్టిందని తెలిపారు.మహిళ ఫిర్యాదుపై, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354 (ఆమెను కించపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 509 (మహిళ  అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు.

రాహుల్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్‌ 279 (రాష్‌ డ్రైవింగ్‌ లేదా రైడింగ్‌), 304ఏ (నిర్లక్ష్యం కారణంగా మరణం) కింద మరో కేసు నమోదు చేశామని, రాహుల్‌ని యాక్సిడెంట్ చేసిన వాహన డ్రైవర్ ను కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాహుల్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ బయట గుమిగూడారు. రాహుల్ మీద ఫిర్యాదు చేసిన మహిళను చూడాలని డిమాండ్ చేశారు. మూడు-నాలుగు గంటలపాటు నిరసన తెలిపారని డిసిపి కల్సి తెలిపారు.

వారిని అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరామని, వారి ఫిర్యాదులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వీరిని రోడ్డుకు ఒకవైపు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చి ట్రాఫిక్‌ను సాధారణీకరించినట్లు వారు తెలిపారు.

మృతుల కుటుంబ సభ్యులు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయమైన విచారణ జరిపించాలని, పోలీస్ స్టేషన్ వెలుపల ప్రమాదం జరిగినందున కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

click me!