ఇద్దరు గుజరాత్ మాజీ సీఎంల వాహనాలకు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ముఖ్యమంత్రులు...

By SumaBala Bukka  |  First Published Nov 7, 2023, 8:47 AM IST

మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ట్రక్కు ఢీ కొట్టగా, మరో ఘటనలో కాన్వాయ్ లోని వాహనం సైకిలిస్ట్ ను గుద్దింది. ఈ ఘటనల్లో ఎవ్వరూ గాయపడలేదు. 


అహ్మదాబాద్‌ : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రులు విజయ్‌ రూపానీ, సురేశ్‌ మెహతాల వాహనాలు సోమవారం రెండు వేర్వేరు ఘటనల్లోప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో వీరిద్దరూ ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఉదయం 10.30 గంటల సమయంలో అహ్మదాబాద్-రాజ్‌కోట్ హైవేపై రూపానీ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో 50 ఏళ్ల మోటార్‌సైకిలిస్ట్ గాయపడ్డాడని అధికారి తెలిపారు.

సురేంద్రనగర్ జిల్లా లింబ్డి పట్టణం సమీపంలో బాధితుడు ప్రభు థాకర్షి తన ద్విచక్ర వాహనంపై హైవేను దాటడానికి ప్రయత్నిస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ అదే సమయంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిపి ముంధ్వా తెలిపారు. పంజాబ్‌లో బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రూపానీ రాజ్‌కోట్ నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్నారని తెలిపారు.

Latest Videos

ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఐఈడి పేలుడు, జవాన్ కు తీవ్రగాయాలు...

ముంధ్వా మాట్లాడుతూ.. "ఒక వాహనం మోటారుసైకిలిస్ట్‌ను ఢీకొట్టడంతో కాన్వాయ్ ఆగిపోయింది. మరో కారులో ఉన్న రూపానీ కూడా దిగి గాయపడిన వ్యక్తిని కాన్వాయ్ వాహనంలో లింబ్డిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తి కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి" దీనికి సంబంధించి ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడలేదని తెలిపారు. రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

మరో ప్రమాదంలో, మోర్బి జిల్లా హల్వాద్ పట్టణం సమీపంలో మాజీ ముఖ్యమంత్రి సురేష్ మెహతా కారును ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మెహతా అహ్మదాబాద్‌ నుంచి కచ్‌కు వెళ్తుండగా రౌండ్‌అబౌట్‌ వద్ద ఆయన కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ కారణంగా కారుకు కొన్ని గీతలు పడ్డాయని హల్వాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దీపక్ ధోల్ తెలిపారు.

"మెహతా కారు రౌండ్‌అబౌట్‌లో ఆగిన వెంటనే ట్రక్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. అయితే, అది హెవీ వెహికిల్ కావడంతో బ్రేక్ వేసినా ఆగడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది. దీంతో ట్రక్కు నెమ్మదిగా కారును తాకింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన కారులో కాకుండామరో వాహనంలో తన ప్రయాణాన్ని కొనసాగించారు" అని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మెహతా అక్టోబర్ 1995 నుండి సెప్టెంబర్ 1996 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
 

click me!