
Uttarakhand Assembly election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం తన మేనిఫెస్టో (manifesto) ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రజలపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచుతామని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో నాలుగో వంతు విద్యకు కేటాయిస్తామని ఆప్ స్పష్టం చేసింది. హామీలను నెరవేర్చకుంటే పార్టీపై కేసులు పెట్టేందుకు వీలు కల్పిస్తూ అఫిడవిట్‌ను సైతం ఆప్ విడుదల చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో (manifesto) లో ఉత్తరాఖండ్‌ను అవినీతి రహితంగా చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచుతామని హామీ ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 25 శాతానికి కేటాయింపులు పెంచుతామని పేర్కొంది. అలాగే, ఉచిత విద్యుత్ ఆఫర్ కూడా ఆప్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడంతోపాటు ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. అలాగే, ఉపాధికి కల్పనకు సంబంధించిన కూడా కీలక విషయాలను మేనిఫెస్టోలో ప్రస్తావించింది.
ఉత్తరాఖండ్ లో తాము ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ. 5000 ఆర్థిక సాయం అందచేస్తామని స్పష్టం చేసింది. అలాగే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు రూ.1,000 అందజేస్తామన్నారు. "ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందిస్తాం. ఉత్తరాఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కూడా IIT, AIIMS లకు వెళతారు" అని AAP ఎన్నికల మేనిఫెస్టో పేర్కొంది. "ప్రతి గ్రామంలో ఉచిత, ఉత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకువస్తాం. వృద్ధులకు ఉచిత తీర్థయాత్రను అందిస్తాము. ఉత్తరాఖండ్‌ను హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తాము" అని ఆప్ మ్యానిఫెస్టో (manifesto) తెలిపింది.
అలాగే, మాజీ సైనికులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం శిక్షణ అందించేందుకు జనరల్ బిపిన్ రావత్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించనున్నట్లు ఆప్ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో స్పోర్ట్స్ యూనివర్శిటీని నిర్మిస్తామని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కాగా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు-2022 ఫిబ్రవరి 14 న ఒకే దశలో జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతకు ముందు 2017లోనూ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు (Assembly election) జరిగాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో 57 గెలుచుకుంది.