AAP MP Raghav Chadha: 'సత్రాలపై జిజియా పన్ను'.. వాటిపై GST ఉపసంహరించుకోవాలని AAP డిమాండ్

By Rajesh KFirst Published Aug 4, 2022, 8:36 PM IST
Highlights

AAP MP Raghav Chadha: పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకుని సత్రాలపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

AAP MP Raghav Chadha: పుణ్య‌క్షేత్రాలల్లోని స‌త్రాల‌పై కేంద్రం ప్ర‌భుత్వం GST విధించ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయంగా మారింది.  స‌త్రాల‌పై విధించిన జీఎస్టీని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలోని సత్రాలపై విధించిన 12 శాతం జీఎస్టీ(GST) ని ఉపసంహరించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మరోసారి పునరుద్ఘాటించారు. 

ఈ మేరకు ఎంపీ రాఘవ్ చద్దా గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిని ఓ మెమోరాండం అంద‌జేశారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వెలుపల సత్రాలు ఉన్నాయని, ఈ సత్రాలను గురుద్వారా నిర్వాహకులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ స‌త్రాల‌పై 12 శాతం జిఎస్‌టి విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సిక్కు మత అనుచరులతో పాటు.. శ్రీ దర్బార్ సాహిబ్‌ను సందర్శించే భక్తులలోనూ అసంతృప్తిని కలిగించిందని ఆర్థిక మంత్రికి తన మెమోరాండంలో పేర్కొన్నారు.  ఈ సమావేశంలో తమ డిమాండ్లను పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని ఎంపి రాఘవ్ చద్దా తెలిపారు. 

అనంత‌రం ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. సత్రాల‌పై GST విధించ‌డాని ప‌రిశీలిస్తే.. మొఘల్ పాల‌న గుర్తుకు వ‌స్తుంద‌నీ, ఆనాటి పాలకులు సిక్కులుపై విధించిన జిజియా పన్ను గుర్తుకు వ‌స్తుంద‌ని అన్నారు. మొగ‌ల్ పాల‌కుడు ఔరంగజేబు తీర్థయాత్రపై పన్ను విధించడం ద్వారా పన్ను వసూలు చేశార‌ని గుర్తు చేశారు. కేంద్రం ప్ర‌భుత్వం .. స‌త్రాల‌పై GST విధించడం స‌రికాద‌ని అన్నారు. 

నేడు గురుద్వారా వెలుపల నివ‌సించే సంగత్ లు ఈ చిన్న సత్రాలు న‌డుపుతున్నాయ‌నీ, దానిపై కూడా GST విధించడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందని అన్నారు. మూడు కోట్ల మంది పంజాబీల తరపున ఈ పన్నును ఉపసంహరించుకోవాలని మొత్తం సంగత్ తరపున ఆర్థిక మంత్రిని అభ్యర్థించామని చద్దా తెలిపారు. మన భక్తిపై మనకున్న విశ్వాసంపై ఈ రకమైన పన్ను ఉండకూడదనీ, మన విశ్వాసంపై, మన భావాలపై ఎలాంటి పన్ను విధించకూడదని అన్నారు. 

తాను  వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్‌ని, ఏ పన్ను విధించబడుతుందో త‌న‌కు తెలుసుననీ, ఎవరైనా ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళితే.. ఆ పన్ను విధించినట్లే లాభాన్ని పొందడానికి అక్కడ ఉన్న సంస్థలపై పన్ను విధించబడుతుందనీ, లాభాపేక్ష‌తో న‌డిచే సంస్థ‌ల‌పై ప‌న్ను విధించ‌డం చూశాం ..కానీ లాభాపేక్ష లేని సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప‌న్నులు విధిస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

పంజాబ్ కడుపు కోసి.. దేశం కడుపు నింపుతోంది

అలాగే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంలో.. పంజాబ్‌లో భూగర్భజలాల సమస్యను వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా డిమాండ్ చేసిన‌ట్టు తెలిపారు. ఈ స‌మ‌యంలో కేంద్రం ఆర్థిక ప్యాకేజీ పై ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం పంజాబ్ కడుపు కోసి దేశం కడుపు నింపే పని చేసిందని విమ‌ర్శించారు. 1965లో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు.. దేశం మొత్తం ఆహార ధాన్యాల విషయంలో చాలా దుర్భరమైన దశలో ఉన్నప్పుడు.. పంజాబ్ రైతులు దేశాన్ని పోషించి.. హరిత విప్లవానికి నాంది పలికారని అన్నారు. పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్న విష‌యం తెలిసిందే.  

click me!