
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అనుచరులపై ఢిల్లీ పోలీసులు మూడు కేసులు పెట్టారు. అందులో ఒకటి అక్రమ ఆయుధాల కేసు. ఈ అక్రమ ఆయుధాల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అనుచరుడు హమీద్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ పోలీసులు శనివారం జామియా నగర్ పోలీసు స్టేషన్‌లో మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన అనుచరులకు సంబంధించిన ప్రాంతాల్లో దాడులు చేసిన తర్వాత ఈ కేసులు రిజిస్టర్ చేశారు. ఈ దాడులు శుక్రవారం చేసిన సంగతి తెలిసిందే.
సౌత్ ఈస్ట్ జిల్లా పోలీసులు ఆప్ ఎమ్మెల్యే అనుచరులు హమీద్ అలీ, కౌసర్ ఇమామ్ సిద్దిఖీలపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. మూడో కేసు ఏసీబీ ఉద్యోగులు దాడులు చేయకుండా అడ్డుకున్నందుకు నమోదు చేశారు. తొలి కేసు ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ సమీప ఆంతరంగికుడు హమీద్ అలీపై అక్రమ ఆయుధాల చట్టం కింద నమోదైంది. ఈయనను శనివారం అరెస్టు చేశారు. హమీద్ అలీకి సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేయగా.. అక్రమ ఆయుధం, కొన్ని లైవ్ కార్ట్‌రిడ్జ్‌లు, రూ. 12 లక్షల నగదు లభించాయి.
రెండో కేసు కౌసర్ ఇమామ్ సిద్దిఖీపై నమోదైంది. ఈయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేసినప్పుడు దేశీయ తుపాకీ, మూడు లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, సిద్దీఖీ అరెస్టు నుంచి తప్పించుకుంటున్నట్టు తెలిసింది. కాగా, మూడో కేసు ఏసీబీ దాడులను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై నమోదైంది. ఆ కేసులో నిందితులను ఇంకా గుర్తిస్తున్నారు.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ శుక్రవారం అరెస్టు చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అవినీతి కేసుకు సంబంధించి ఈయనను అరెస్టు చేశారు. అమానతుల్లా ఖాన్‌కు సంబంధించిన ప్రాంతాల్లో దాడులు చేయగా నేరపూరిత మెటీరియల్స్, ఎవిడెన్స్‌లు లభించాయి. అనంతరం, ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.