
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కి.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. హర్భజన్ ను ఆమ్ఆద్మీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. దీంతో పాటు స్పోర్ట్స్ యూనివర్శిటీలో కీలక బాధ్యతలను కూడా అప్పజెప్పనున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆప్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లెక్కల ప్రకారం రాజ్యసభలో ఆప్‌కు ఐదు సీట్లు దక్కుతాయి. మొట్ట మొదటగా హర్భజన్ పేరునే కేజ్రీవాల్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే కేజ్రీవాల్ హర్భజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నామని ప్రకటించనున్నారు.
మార్చి 10న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేయడం ద్వారా భగవంత్ మాన్‌కు అభినందనలు తెలిపారు. భగవంత్ మాన్ తల్లిని కౌగిలించుకున్న చిత్రాన్ని పంచుకుంటూ, “కొత్త ముఖ్యమంత్రి అయినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, నా స్నేహితుడు భగవంత్ మాన్‌కు అభినందనలు. ఖట్కర్‌కలన్ గ్రామంలో భగత్ సింగ్‌లో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 117 సీట్లలో ఆప్ 92 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఖాతాలో 18 సీట్లు చేరాయి. అకాలీదళ్ మూడు, బీజేపీ రెండు, బీఎస్పీ, స్వతంత్రులు ఒక్కో సీటు గెలుచుకున్నారు. పంజాబ్‌లోని మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐదుగురిలో ఒకరిగా హర్బజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది.
గతంలో హర్భజన్ కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సిద్దూతో భజ్జీ భేటీ అయ్యారు. అతి త్వరలో భజ్జీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారని పంజాబ్ కాంగ్రెస్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.