
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుబట్టింది. ఆప్ నేత సంజయ్ సింగ్ మట్లాడుతూ.. విపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడం దర్యాప్తు సంస్థలకు పనిగా మారిందని విమర్శించారు. ప్రశ్నించినవారిపై బీజేపీ పిచ్చెక్కినట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విపక్ష నేతలను వేధించేందుకే కవితకు నోటీసులు అని పేరొన్నారు. మహిళల హక్కుల కోసం ఈ నెల 10వ తేదీన దీక్ష చేస్తున్నందుకే కవితకు నోటీసులు అని అన్నారు.
అనారోగ్యంతో ఉన్నవారిని కూడా విడిచి పెట్టడం లేదని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్ పెంచండి అంటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గల్లీ గల్లీకి ఈడీ, సీబీఐ బ్రాంచ్‌లను తెరిచి.. విపక్ష నేతలను జైళ్లలో పెట్టండంటూ ఫైర్ అయ్యారు. శవాలను కూడా విచారించే నియమాలను తీసుకురండి అంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కోర్టు.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ అని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండోస్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది.
ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, ఏపీ వైఎస్ఆర్‌సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఇక, ఈ కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్ళైని కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా.. 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీచేశారు. గురువారం (మార్చి 9)రోజున ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.