
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ రోజు ఢిల్లీ మేయర్ ఎన్నిక జరగగా.. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మేయర్ ఎన్నికల్లో.. 10 మంది నామినేటెడ్ ఎంపీలు, 14 మంది నామినెటేడ్ ఎమ్మెల్యేలు, మొత్తం 250 కౌన్సిలర్లలో 241 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 9 మంది కౌన్సిలర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తం 266 ఓట్లు పోలు కాగా.. అందులో షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, బిజెపి అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంత్ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
గత కొంతకాలంగా ఢిల్లీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 134 కౌన్సిలర్ స్థానాల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. 250 స్థానాలున్న ఢిల్లీ కార్పోరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. అయితే జనవరి 6న ఢిల్లీ కార్పోరేషన్‌లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణం సందర్భంగా ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీకి చెందిన సత్యశర్మను తాత్కాలిక స్పీకర్ గా లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆప్ కౌన్సిలర్లు మండిపడ్డారు.
ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీలో ఆరుగురు స్టాడింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి మూడుసార్లు సభా సమావేశాలు జరిగినా రసాభాస కావడంతో వాయిదా పడ్డాయి. తొలి సమావేశం జనవరి 6, రెండో సమావేశం జనవరి 24, మూడో సమావేశం ఫిబ్రవరి 6న జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఓటింగ్‌కు అనుమతించడాన్ని ఆప్ వ్యతిరేకించింది. వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957 ప్రకారం.. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదని చెప్పింది.
ఈ క్రమంలోనే ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయలేరని భారత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరపాలంటూ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమోదించారు. ఈ క్రమంలోనే నేడు మేయర్ ఎన్నిక నిర్వహించారు.