
హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ రాష్ట్రంలో ఎదురు దెబ్బ తగిలింది. ఆప్ హిమాచల్ చీఫ్ అనుప్ కేసరి తో పాటు మరో ఇద్దరు ముఖ్య నాయకులు బీజేపీలో చేరారు. వారిని బీజేపీ చీఫ్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ పరిణామంపై ఆప్ స్పందించింది. అలాంటి నాయకులు ఆ పార్టీలోనే ఉండాలని పేర్కొంది. త్వరలోనే తామే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నాం అని తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో స్పందిస్తూ.. బీజేపీ తనకు బయపడదని, ప్రజలకు బయడుతుందని అన్నారు. ‘‘ బీజేపీ నాయకులూ.. ప్రజల కోసం నిజాయితీగా పని చేసి ఉంటే మీకు ఇంత భయం అవసరం లేదు. సీఎంను మార్చాల్సిన అవసరం ఉండేది కాదు. ఇతర పార్టీల కళంకితుల కాళ్లపై పడాల్సిన అవసరం ఉండేది కాదు.. ఆప్‌పై ప్రజలకు విశ్వాసం ఉంది. AAP హిమాచల్ ప్రదేశ్ కు దృఢమైన, నిజాయితీ, దేశభక్తి గల ప్రభుత్వాన్ని అందిస్తుంది ’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
మరో ఆప్ నాయకుడు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. అనుప్ కేసరి మహిళపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ విషయంలో పార్టీకి ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ విషయంలో ఆయనను ఎలాగైనా బహిష్కరించాలని అనుకున్నామని చెప్పారు. త్వరలోనే ఆ పని చేస్తామని పేర్కొన్నారు. అలాంటి వారికి బీజేపీలోనే స్థానం ఉంటుందని సిసోడియా అన్నారు.
శుక్రవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు అనుప్ కేసరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర్, ఉనా జిల్లా చీఫ్ ఇక్బాల్ సింగ్ ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనుప్ కేసరి మాట్లాడుతూ.. ‘‘ మేము హిమాచల్ ప్రదేశ్‌లో గత ఎనిమిదేళ్లుగా ఆప్ కోసం అత్యంత నిజాయితీ, అంకితభావంతో పని చేస్తున్నాం. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల మండిలో రోడ్ షో నిర్వహించినప్పుడు రాష్ట్ర పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు ’’ అని అన్నారు.
‘‘ మేము ఆయన (అరవింద్ కేజ్రీవాల్) తీరు పట్ల మేము చాలా నిరుత్సాహపడ్డాము. పార్టీ కోసం పగలు రాత్రి పని చేసే మా వైపు కూడా ఆయన చూడలేదు. అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాత్రమే మండిలో జరిగిన రోడ్‌షోలో హైలెట్ అయ్యారు. కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడానికి, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి మేము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం ’’ అని అన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముగ్గురు ఆప్ నేతలను స్వాగతించారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలుపుకోవడంలో ఈ నాయకుల మద్దతు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వీరి రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. రోడ్ షోలో ఆప్ కార్యకర్తలను అవమానించినందుకు కేజ్రీవాల్‌పై కూడా అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ‘‘ ఓ వైపు కేజ్రీవాల్ తన పార్టీ గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ మరోవైపు ఆయన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను పట్టించుకోకుండా అవమానించాడు. మండిలో జరిగిన రోడ్‌షోలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మినహా ఆ వాహనంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆ వాహనంపై ఏ నాయకుడికి చోటు కల్పించలేదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.