
న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వరాలు, ఉచితాలు ప్రకటించడంపై ఎన్నికల సంఘం ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సాధారణంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఊహించని విధంగా ఉచితాలు ప్రకటిస్తూ ఉంటాయి. తాము అధికారంలోకి వస్తే అనేక సేవలు, వస్తువులను ఉచితంగా అందిస్తామని ఓటర్లను ఆకర్షిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అవి ప్రకటించే ఉచితాలు వాస్తవంలో సాధ్యమవడానికి చాలా దూరంగా ఉంటాయి. ఒక వేళ అధికారంలోకి వచ్చినా.. ఆ ఉచితాలను ప్రజల ధనంతో అందిస్తాయి. కాబట్టి, ప్రజా ధనంతోనే ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయ పార్టీల చర్యలను చాలా మంది విమర్శిస్తుంటారు. వీటిని నియంత్రించడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ పిల్‌ను స్వీకరిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలను నియంత్రించకుంటే.. ప్రజాస్వామిక విలువలు ఆవిరైపోతాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పరిణామం చాలా ఆందోళనకరం అని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ఇది చాలా సీరియస్ విషయం అని పేర్కొంది. ఈ ఉచితాలు వాస్తవ బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. అనంతరం, ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
ఈ పిల్‌పై ఈసీ ఇవాళ సుప్రీంకోర్టుకు సమాధానాలు ఇ,చ్చింది. ఉచితాలు ప్రకటించిన తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీలు వాటిని అమలు చేయడాన్ని ఎన్నికల సంఘం అడ్డుకోలేదని స్పష్టం చేసింది. అది ఎన్నికల సంఘం పరిధిలోనిది కాదని వివరించింది. చట్టంలో ప్రత్యేకంగా దాని గురించి పేర్కొనకుండా వాటిని నియంత్రించే చర్యలు చేపట్టలేమని తెలిపింది.
అవసరం అయితే.. కోర్టు ప్రత్యేకంగా రాజకీయ పార్టీల కోసం గైడ్‌లైన్స్ తయారు చేయవచ్చునని వివరించింది. అంతేకానీ, వాటిని అమలు చేయడానికి ఎన్నికల సంఘం ఒత్తిడి చేయలేదని తెలిపింది. ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన ఉచితాలు, వరాలు, తాయిలాలు నిజంగా అమలుకు సాధ్యపడేవేనా? కాదా? ఒక వేళ వాటిని అమలు చేసినా.. రాష్ట్ర లేదా దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగానే ఉంటుందా? లేదా? అనే విషయాన్ని ఓటర్లే నిర్ణయించుకోవాలని పేర్కొంది.
ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీలు ప్రజా ధనంతో ఉచితాలు అందిస్తామని వాగ్దానాలు చేయడాన్ని నివారించాలని, అలా ప్రకటించిన పార్టీల ఎన్నికల గుర్తును సీజ్ చేయాలని, ఆ రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ గుర్తింపును తొలగించాలని పిటిషనర్, బీజేపీ లీడర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. ఈ చర్యలు తీసుకునేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. అంతేకాదు, ఈ పద్ధతిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓ చట్టం తీసుకువచ్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘాని(Election Commission of India)కి నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్ విచారిస్తూ.. ఉచితాలు, తాయిలాలు ప్రకటిస్తూ ఓట్లను రాబట్టుకోవడం తీవ్రమైన అంశం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇాది చాలా తీవ్రమైన విషయం అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ ఉచిత వాగ్దానాల బడ్జెట్.. రెగ్యులర్ బడ్జెట్‌ను దాటి పోతుందని అన్నారు. ఇది అవినీతి కాకపోయినా.. పోటీలో తారతమ్యాలను సృష్టిస్తుందని వివరించారు. అదే సమయంలో పిటిషన్ కొన్ని అంశాల్లో సెలెక్టివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో మీరు కేవలం రెండింటినే ప్రస్తావించారు అని సీజేఐ లేవనెత్తారు. మీ అప్రోచ్ కూడా కొంత పరిధి మేరకు ఉన్నదని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. అయితే, ఈ పిటిషన్‌లో లేవనెత్తిన న్యాయమపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.