
ఆధార్ కార్డ్: ఆధార్ కార్డు ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన గుర్తింపు . మనం ఏ ప్రభుత్వ పథక ప్రయోజనాన్ని పొందాలన్న.. ఆధార్ ఉండాల్సిందే. పిల్లల అడ్మిషన్లు, ఉద్యోగాలు లేదా ఇతర ప్రదేశాలకు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎలాంటి అంతరాయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ..ఈ కార్డ్ మనకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తోంది. ఆధార్ ప్రయోజనాలు మరింత విస్తృతం చేయడానికి కేంద్రం ప్రభుత్వం కొత్తగా సంస్కరణలను చేపట్టనున్నది.
కొత్త ఆధార్ నమోదు విషయంలో ఇబ్బందులు పడకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బర్త్ సర్టిఫికెట్లతోపాటే ఆధార్ కార్డు అందించేలా చర్యలు చేపట్టింది. అంటే.. నవజాత శిశువులకు( అప్పుడే పుట్టిన పిల్లలు) జనన ధృవీకరణ పత్రంతో పాటు, వారి ఆధార్ కార్డును అందించేలా కేంద్రం అన్ని రాష్ట్రాల్లో ఏర్ఫాటు చేయనున్నది. ఈ మేరకు త్వరలో చర్యలు ప్రారంభించనున్నది. ఈ ప్రక్రియ మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంా ప్రారంభం కానున్నది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో మాత్రమే నవజాత శిశువులకు బర్త్ సర్టిఫికెట్ తో పాటే ఆధార్ నమోదు చేస్తుండగా.. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదు సమయంలో ఎలాంటి బయోమెట్రిక్ సమాచారం తీసుకోవడం లేదు. అయితే..పిల్లలకి 15 సంవత్సరాల వయస్సు వచ్చాక బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్‌ను జారీ చేసే లక్ష్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఆధార్ నంబర్ జారీ చేసే ఏజెన్సీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది. ఈ ప్రక్రియ కోసం కంప్యూటర్ ఆధారిత జనన నమోదు విధానం అవసరమని, అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల ఆధార్ నమోదు సమయంలో .. తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు, చిరునామాలు, పిల్లల ఫొటోను మాత్రమే తీసుకుంటున్నారు. జనన పత్రం ఇచ్చే సమయంలోనే తల్లిదండ్రుల ఆధార్ తీసుకుని.. ఆ వివరాల ఆధారంగా చిన్నారులకు ఆధార్ జారీ చేయనున్నారు.
ఆధార్ డేటాను అప్‌డేట్ చేయాల్సిందే...
గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఆధార్ మోసానికి సంబంధించిన అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరు మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే.. పదేళ్ల క్రితం ఆధార్ కార్డును పొంది ఆ తర్వాతి ఎలాంటి సమాచారాన్ని అప్‌డేట్ చేయని వారు.. గుర్తింపు లేదా చిరునామాతో కూడిన పత్రాలతో దానిని అప్‌డేట్ చేయాలని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే..మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించాలని సూచించింది.