ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో ఆమె తన టీమ్ తో కలిసి బడ్జెట్ కి సంబంధించి కసరత్తులు చేశారు.
కేంద్ర బడ్జెట్ కి సమయం ఆసన్నమైంది. త్వరలోనే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో ఆమె తన టీమ్ తో కలిసి బడ్జెట్ కి సంబంధించి కసరత్తులు చేశారు. ఈ ఏడాది బడ్జెట్ కి సంబంధించి నిర్మలమ్మతో కలిసి పనిచేసిన టీమ్ సభ్యులు ఎవరో ఓసారి చూసేద్దామా..
1. టీవీ సోమనాథన్
వ్యయ కార్యదర్శి. తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించే పని ఈయనకే కేంద్రం అప్పగించింది. కొవిడ్-19 నేపథ్యంలో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదాయ-వ్యయాలను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
2.తుహిన్ కాంత పాండే
పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి. పంజాబ్ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ బాధ్యతలు ఈయనపైనే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఖాజానాకు నిధుల సమీకరణ.. వాటాల విక్రయంపైనే ఆధారపడి ఉన్నది.
3.తరుణ్ బజాజ్
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. ప్రభుత్వ విధానాలు, పాలనలో 31 ఏండ్ల అనుభవం ఉన్నది. ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై గట్టి పట్టుగలదు. హర్యానా క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బడ్జెట్‌లో ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తే జీడీపీ పురోగమిస్తుందో చెప్పే బాధ్యత ఈయన చేతుల్లోనే కేంద్రం పెట్టింది.
4.కేవీ సుబ్రమణ్యన్
ముఖ్య ఆర్థిక సలహాదారు. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎంల పూర్వ విద్యార్థి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. 2020-21 ఆర్థిక సర్వేలో కీలకపాత్ర పోషించారు. ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు తదితర రంగాలపై కరోనా ప్రభావాన్ని అంచనా వేశారు.
5.దేబాశిష్ పండా
ఆర్థిక సేవల కార్యదర్శి. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్. బ్యాంకింగ్ రంగ నిపుణుడిగా పేరుంది. కరోనా నేపథ్యంలో బ్యాంక్ రుణాలకు క్షీణించిన ఆదరణను మళ్లీ పెంచడం, ఒత్తిడిలో ఉన్న రంగాలను గుర్తించి రుణాల ద్వారా నిధుల కొరతను తీర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
6.అజయ్ భూషణ్ పాండే
ఆర్థిక కార్యదర్శి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఐదుగురు కార్యదర్శుల్లో అందరికంటే సీనియర్. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఆధార్ కార్డ్ ప్రక్రియలోనూ పాలుపంచుకున్నారు. ప్రస్తుత మోదీ సర్కారు పాలనలోని రెవిన్యూ విధానంలో భూషణ్ చెరగని ముద్ర వేశారు.