
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా 18 నెలల నుంచి 10 ఏళ్ల వయస్సున్న ఆరుగురు పిల్లలను ఓ తల్లి బావిలో పడేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తల్లి కూడా బావిలో దూకింది. అయితే స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. కానీ చిన్నారులను కాపాడలేకపోయారు. ఈ ఘటప రాయ్ ఘడ్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ (30) తన భర్త, పిల్లలతో కలిసి ఉపాధి కోసం మహారాష్ట్రకు వచ్చారు. వీరు ముంబైకు 100 కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకాలోని ఖరావలి గ్రామంలో ఉంటున్నారు. అయితే కుటుంబ కలహాలు ఏర్పడటంతో ఆమె తన పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఖరావలి గ్రామంలోని ఓ బావిలో మంగళవారం 6 గురు పిల్లలను తోసేసింది. ఆ పిల్లల వయస్సు 18 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
Singer KK : ప్రముఖ గాయకుడు కేకే మృతి..
పిల్లలను బావిలో పడేసిన అనంతరం ఆమెకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని నీటిలో దూకింది. అయితే ఈ ఘటనను స్థానికులు గమనించారు. వెంటనే నీటిలో దూకి సుహానిని కాపాడారు. అయితే చిన్నారులను మాత్రం ప్రాణాలతో కాపాడలేకపోయారు. అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన సమాచారం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో సుహానీ తన నేరాన్ని ఒప్పకుంది. దీంతో ఆమెను అరెస్టు చేసి హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
అయితే సుహానీ తన భర్తతో వాగ్వాదం జరగడంతో కోపంతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. భర్త తాగుడుకు బానిస అవ్వడంతో ఈ జంట మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల గొడవ జరడంతో ఈ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. మరోవైపు, పిల్లల మృతదేహాలను బావి నుండి వెలికితీసి, వారి అంతిమ సంస్కారాలను మంగళవారం నిర్వహించామని అధికారులు తెలిపారు.
Singer KK : బాలీవుడ్ సింగర్ కేకే మృతి పట్ల ప్రధాని, కేంద్ర హోం మంత్రి సంతాపం
ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట చెన్నైలో ఓ తండి కూడా ఇలాంటి ఘోరానికి పాల్పడ్డాడు. పెళ్లిరోజునాడే తన భార్య, పిల్లలను రంపంతో కోసి తనూ ఆత్మహత్యకు ఒడిగట్టాడు. 41 ఏళ్ల ప్రకాశ్ చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈయనకు భార్య గాయత్రి (39), పిల్లలు నిత్యశ్రీ (13), పి హరికృష్ణన్ (8) ఉన్నారు. భార్య స్థానికంగా మూలికా మందుల దుకాణం నడుపుతోంది. అయితే దీనిని డెవలప్ చేసేందుకు కరోనా సమయంలో భర్త 10 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే అవి తీర్చలేకపోయాడు. దీంతో మానసికంగా సంఘర్షణ పడి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లలను, భార్యను ఎలక్ట్రిక్ట్ రంపంతో కోసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.