
దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని తౌడుగోలి గ్రామంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా ఉండటంతో ఘోర ప్రమాదం తప్పింది. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక మహిళ రోడ్డును నెమ్మదిగా దాటుతోంది. అయితే ఆమె ఇరువైపులా చూడకుండా ముందుకు వస్తోంది. సరిగ్గా అప్పుడే రోడ్డుకు అవతలి వైపు నుంచి ఓ ప్రైవేట్ బస్సు వేగంగా దూసుకొస్తోంది.
అయితే ఆ బస్సును నడుపుతున్న డ్రైవర్ మాత్రం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి బస్సుకు బ్రేకులు వేసి స్టీరింగ్‌ను కుడివైపుకు తిప్పి ఘోర ప్రమాదాన్ని నివారించగలిగాడు. బస్సు రాసుకుంటూ పక్కకు వెళ్లడంతో చిన్నపాటి గాయాలతో సదరు మహిళ తప్పించుకోగలిగింది. జూన్ 20 ( మంగళవారం )ఉదయం 11.47 గంటలకు ఈ ఘటన జరిగింది. రెప్పపాటులో పెను ప్రమాదం జరగకుండా కాపాడిన డ్రైవర్ చాకచక్యాన్ని స్థానికులు అభినందించారు. ఈ ఘటన మొత్తం రోడ్డు పక్కనే వున్న ఓ దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.