ఇండియా కూటమికి పెద్ద పరీక్ష.. నేడే 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు..

By Asianet NewsFirst Published Sep 8, 2023, 9:26 AM IST
Highlights

సెప్టెంబర్ 5వ తేదీన ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఆయా రాష్ట్రాల్లోని కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఉప ఎన్నికలు ఇవి. 

దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన తరువాత పలు రాష్ట్రాల్లో జరిగిన మొదటి ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష కూటమి ఇండియాకు ఈ ఎన్నికల ఫలితాలు పెద్ద పరీక్షగానే చెప్పవచ్చు. 

ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్ లోని ఘోసి, కేరళలోని పుత్తుపల్లి, పశ్చిమబెంగాల్ లోని ధూప్గురి, జార్ఖండ్ లోని దుమ్రి, త్రిపురలోని బాక్సానగర్, ధన్ పూర్ స్థానాలకు మూడు రోజుల కిందట ఎన్నికలు జరిగాయి. ఈ ఏడు స్థానాల్లో ధన్పూర్, బాగేశ్వర్, ధూప్గురి స్థానాలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. యూపీ, జార్ఖండ్ లలో వరుసగా సమాజ్ వాదీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా స్థానాలు ఉన్నాయి. త్రిపురలోని బాక్సానగర్, కేరళలోని పుత్తుపల్లి స్థానాలు వరుసగా సీపీఎం, కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ తరుఫున గెలుపొందిన ఘోసీ స్థానం నుంచి గెలుపొందిన ఓబీసీ నేత దారాసింగ్ చౌహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తిరిగి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే అదే స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, కేబినెట్ మంత్రిగా ఉన్న చందన్ రామ్ దాస్ ఏప్రిల్ లో మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మరణంతో కేరళలోని పుత్తుపల్లి స్థానం ఖాళీ అయింది. కాగా.. త్రిపురలో ఓట్ల లెక్కింపును బహిష్కరిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించింది. పశ్చిమబెంగాల్ లోని ధూప్గురిలో అధికార తృణమూల్ ను ఎదుర్కొనేందుకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. ఈ మూడు పార్టీలు ‘ఇండియా’ కూటమిలో భాగంగానే ఉన్నాయి. 

click me!