
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారంనాడు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. రాష్ట్రంలోని కన్యాకుమారిలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరో వైపు రాష్ట్రంలోని మైలాడుదురైలో బస్సు, బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలతో పాటు అతి వేగం కూడా కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏవోబీలో ఈ నెల 4న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 4వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
ఈ నెల 6వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వ్యాన్, మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని హర్దోయ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బస్సు బోరాడ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీకొట్టి బోరాడ్ నదిలో బస్సు పడిపోయింది. శ్రీఖండి నుండి ఇండోర్ వైపు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఈ నెల 10న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలోని మోర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో గల మదన్ పూర్ ఫారెస్ట్ బారియర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.