మళ్లీ కరోనా పంజా?.. కొత్తగా 841 కేసులు.. నెల క్రితం కొత్త కేసులు 156.. యాక్టివ్ కేసులు 5,389

By Mahesh KFirst Published Mar 18, 2023, 2:21 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం కేంద్రం ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ దేశంలో కొత్తగా 841 కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి పెరిగాయి. 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు రిపోర్ట్ అయ్యాయి.
 

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోమారు కరోనా పంజా విసరడానికి సిద్ధం అవుతున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజులో వందకు అటూ ఇటూగా ఉండేవి. కానీ, గత కొన్ని రోజులుగా ఈ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తున్నది. ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 18వ తేదీన 841 కరోనా కేసులు నమోదైనట్టు బులెటిన్ వచ్చింది. అదే నెల క్రితం అంటే ఫిబ్రవరి 18వ తేదీన 156 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 18నాటి బులెటిన్‌లో కరోనాతో మరణాలు సంభవించలేవు. కానీ, తాజా బులెటిన్ ప్రకారం, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కరి చొప్పున ఇద్దరు మరణించారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలో రోజువారీ సగటు కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన డైలీ యావరేజ్ కొత్త కేసుల సంఖ్య 112గా ఉన్నది. కాగా, మార్చి 18వ తేదీన అంటే ఈ రోజు యావరేజ్ డైలీ కొత్త కేసుల సంఖ్య 626కు పెరిగింది.

126 రోజుల్లో అత్యధికంగా కొత్త కేసులు ఈ రోజే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం, కొత్తగా 841 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. కేరళలో రెండు రికవరీలు నమోదయ్యాయి. కాగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు దేశంలో 5,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 4,46,94,349కు పెరిగింది. 

Also Read: వారం క్రితం ప్రధాని ఓపెన్ చేసిన హైవేపై వరద.. వాహనాల యాక్సిడెంట్లు.. మోడీ చెక్ చేశాడా? లేదా?: ప్రయాణికుల ఆగ్రహం

కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లో అత్యధిక కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. 

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆరు రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. స్థానికంగా కేసులు ఒక్క ఉదుటన పెరిగే ముప్పు ఉన్నదని, కాబట్టి, ఆకస్మికంగా కేసుల విస్ఫోటనం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

click me!