మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానికి 8 విపక్ష పార్టీల లేఖ.. కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉన్నది?

Published : Mar 05, 2023, 01:07 PM IST
మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానికి 8 విపక్ష పార్టీల లేఖ.. కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉన్నది?

సారాంశం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. ఆసక్తికరంగా ఈ లేఖలో కాంగ్రెస్ నేతలెవరూ సంతకం పెట్టకపోవడం గమనార్హం.  

న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేశాయి. ఆసక్తికరంగా ప్రతిపక్షాలు రాసిన ఈ లేఖ నుంచి కాంగ్రెస్ పక్కకు తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ లేఖలో సంతకం పెట్టలేదు. 

ప్రతిపక్ష నేతలు సీఎం కే చంద్రశేఖర్ రావు, మమతా బెనర్జీ, భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు ఈ లేఖ పై సంతకాలు పెట్టారు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియా చేజిక్కించుకోవడానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గాంధీలను విచారిస్తున్నది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను గతేడాది ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా నిరసించింది. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. అనూహ్యంగా ఆ ఆందోళనలకు ఇతర విపక్ష పార్టీల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కొన్ని విపక్ష పార్టీలైతే ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేశాయి. తమ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధించినప్పుడు ఆ పార్టీ స్పందించలేదని, ఇప్పుడు వారి అగ్రనేతలను ప్రశ్నించడానికి పిలిచినప్పుడు భూకంపం వచ్చినట్టు వ్యవహరిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ మౌత్ పీస్ రిపోర్ట్ చేసింది. కాంగ్రెస్ నిరసనలకు ఇతర పార్టీలు దూరంగా ఉన్నట్టే.. ఇప్పుడు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల లేఖాస్త్రంలో పాలుపంచుకోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా అంతర్గతంగా కక్షసాధింపు ధోరణులు అవలంభిస్తే.. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత పగటి కలే అని అంటున్నారు.

ప్రధాని మోడీని ఉద్దేశించి ప్రతిపక్షాలు రాసిన లేఖలో ప్రధానంగా ఈ అంశాలు పేర్కొన్నాయి. ‘మన దేశం ఇంకా ప్రజాస్వామ్య దేశమే అని మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ప్రతిపక్షాలపై విపరీత విచారణతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లుతున్నట్టు కనిపిస్తున్నది’ అని వివరించారు.

‘.. మనీశ్ సిసోడియాను దీర్ఘకాలం వెంటాడి వేధించిన తర్వాత అవకతవకాల ఆరోపణలపై ఆధారాలు లేకున్నా సీబీఐ అతడిని అరెస్టు చేసింది.’ అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ‘2014 నుంచి మీ పాలన వచ్చిన తర్వాత ప్రముఖ రాజకీయ నేతలను దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేస్తున్నాయి, రైడ్లు చేస్తున్నాయి. ఇందులో ఎక్కువ మంది ప్రతిపక్ష నేతలే ఉన్నారు. అదేంటో మరి బీజేపీని చేరిన ప్రతిపక్ష నేతలపై ఈ దర్యాప్తు సంస్థల విచారణ వేగం మందగిస్తున్నది’ అని తెలిపారు.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను ఉదాహరణగా తీసుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు హిమంత బిశ్వ శర్మపై 2014 నుంచి 2015 కాలంలో సీబీఐ, ఈడీలు ఫోకస్ పెట్టాయి. అతను బీజేపీలో చేరిన తర్వాత అనూహ్యంగా ఈ కేసులు పురోగతి సాధించనేలేవని పేర్కొన్నాయి. అదే విధంగా నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్‌‌లపై ఈడీ, సీబీఐలు ఆరా తీశాయి. కానీ, వారు బీజేపీలో చేరిన తర్వాత కేసుల దర్యాప్తు ముందుకు సాగలేదని తెలిపాయి.

2014 నుంచి ప్రతిపక్ష నేతలపై రైడ్లు, కేసుల సంఖ్య పెరిగాయని పేర్కొన్నాయి. లాలు ప్రసాద్ యాదవ్, సంజయ్ రౌత్, ఆజాం ఖాన్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్, అభిషేక్ బెనర్జీలైనా వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ శాఖల్లాగే వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇందులో చాలా కేసులు ఎన్నికలకు ముందే నమోదు కావడం చూస్తే అవి రాజకీయంగా ప్రేరేపితమైనవే అని స్పష్టం అవుతాయని వివరించాయి.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే