ఛత్తీస్‌గఢ్‌లో పిడుగులు, వడగళ్ల వాన‌తో 8 మంది మృతి.. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..

By Sumanth KanukulaFirst Published Mar 21, 2023, 4:50 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పిడుగులు, వడగళ్ల వాన కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పిడుగులు, వడగళ్ల వాన కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జైసింగ్ అగర్వాల్ మంగళవారం అసెంబ్లీలో వివరాలు తెలియజేశారు. గత రెండు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో పిడుగులు, వడగళ్ల వాన కారణంగా కనీసం ఎనిమిది మంది మృతి చెందారని చెప్పారు. వివిధ జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, వాటిని అంచనా వేసిన తర్వాత రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో.. అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తారు. వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరపాలని కోరారు. అసెంబ్లీ జీరో అవర్‌లో బీజేపీ శాసనసభ్యుడు శివరతన్ శర్మ మాట్లాడుతూ.. కూరగాయలు, గోధుమలు, ఇతర పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నష్టాలను సర్వే చేయలేదని అన్నారు. శివరతన్ శర్మకు మద్దతుగా  పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే వాదన వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని, పంటలకు జరిగిన నష్టానికి వెంటనే పరిహారం అందించాలని అన్నారు. వాయిదా తీర్మానం నోటీసుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

అయితే డిప్యూటీ స్పీకర్ సంత్రం నేతమ్ బీజేపీ నోటీసును తిరస్కరించారు. అయితే సమస్యను ఏ రూపంలోనైనా చర్చకు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి జైసింగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. తమ శాఖకు పంట నష్టాల నివేదికలు అందాయని చెప్పారు. రాయ్‌పూర్, దుర్గ్, బెమెతర, కబీర్‌ధామ్‌తో సహా అన్ని జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వబడ్డాయని చెప్పారు. 
             
“రాష్ట్రంలో మార్చి 19న 13.7 మి.మీ, మార్చి 20న 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అందిన సమాచారం ప్రకారం.. పిడుగుపాటుకు ఏడుగురు, వడగళ్ల వాన కారణంగా ఒకరు మరణించారు. అంతేకాకుండా,వర్షపాతానికి సంబంధించిన సంఘటనలు కూడా 36 జంతువులను బలిగొన్నాయి. 209 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి’’ అని మంత్రి జైసింగ్ అగర్వాల్ తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా దాదాపు 385.216 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు 15 రోజుల్లోగా పరిహారం అందజేయాలని నిబంధన ఉందని గుర్తుచేశారు.
                
ఇక, ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు రెవెన్యూ అధికారులు తక్షణమే రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోరారు.

click me!