
Parliament session: దేశంలో గత కొంత కాలంగా నిరుద్యోగం పెరుగుతుండటంతో పాటు ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య అధికం అవుతూనే ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం శాఖల్లో ఉద్యోగాల ఖాళీలు, సంబంధిత వివరాలపై ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలు, సంబంధిత వివరాలను గురించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్రంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కేంద్రప్రభుత్వ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8,72,243 పోస్టులు ఖాళీగా ఉండగా.. 2019 మార్చి 1నాటికి 9,10,153 పోస్టులు ఖాళీగా ఉండేవని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2018 మార్చి 1 నాటికి ఈ సంఖ్య 6,83,823గా ఉండేదని తెలిపారు.
కాగా, ఇదే సమయంలో దేశంలోని ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా 2018-19, 2020-21లో 2,65,468 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల్లో యూనియన్ గవర్నమెంట్ సర్వీసుల్లో 21,255 గ్రూప్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించే యూపీఎస్సీలో 485 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
2021 జూలై నుండి సెప్టెంబర్ వరకు త్రైమాసిక ఉపాధి సర్వే (Quarterly Employment Survey-QES) రెండవ రౌండ్ ఫలితాల ప్రకారం, ఆర్థిక వ్యవస్థలోని ఎంపిక చేసిన తొమ్మిది రంగాలలో ఉపాధి 3.1 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. ఆరవ ఆర్థిక గణన (2013-14)లో నివేదించిన ప్రకారం, QES మొదటి రౌండ్‌లో, ఏప్రిల్-జూన్ 2021లో ఇది 3.08 కోట్లుగా ఉంది. 2021లో నిరుద్యోగం పెరిగింది. కరోనా ప్రభావం కూడా దీనికి కారణంగా తెలిపింది.
అలాగే, భారత అంతరిక్ష ప్రయోగాల వివరాలను సైతం వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతున్నదనీ, చంద్రయాన్-3 (Chandrayaan-3) అంతరిక్ష మిషన్ ఏడాది ఆగస్టు లో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) డాక్టర్ జితేందర్ సింగ్ (Dr Jitendra Singh) వెల్లడించారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సంబంధిత వివరాలు తెలియజేశారు.
లోక్‌సభలో అంతరిక్ష ప్రయోగాలు, ఈ ఏడాది చేపట్టబోయే మిషన్ల వివరాలు, గత ప్రయోగాల వివరాలు తెలియజేయాలని ఓ సభ్యుడు కోరారు. ఈ నేపథ్యంలోనే అంతరిక్ష ప్రయోగాలు, ఇస్రో (Indian Space & Research Organisation) చేపట్టబోయే మిషన్ల గురించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇదివరకు నిర్వహించిన విఫలమైన చద్రయాన్ మిషన్ల నుంచి అనేక విషయాలు తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-2 (Chandrayaan-2) నుండి నేర్చుకున్న అంశాలు, జాతీయ స్థాయి నిపుణుల సూచనల ఆధారంగా చంద్రయాన్-3 (Chandrayaan-3)కి సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి మంచి పురోగతిలో ఉన్నామనీ, దీనికి సంబంధించిన అనేక హార్డ్‌వేర్, ఇతర ప్రత్యేక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ లాంచ్ ఈ ఏడాది ఆగస్టు లో షెడ్యూల్ చేయబడిందని చెప్పారు.